కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- April 02, 2026
కేరళ: గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో గొప్ప గౌరవం దక్కింది. సంగీతానికి భాషా పరిమితులు లేవని నిరూపిస్తూ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీటీ భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని కుటుంబ సభ్యులు, సంగీత ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు మనో, చిత్ర, హరిహరన్, సుజాత మోహన్, విజయ్ ఏసుదాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అక్కడి వాతావరణాన్ని మరింత భావోద్వేగభరితంగా మార్చింది.
సంగీత మేఘం కార్యక్రమంతో నివాళి
విగ్రహావిష్కరణ సందర్భంగా ‘సంగీత మేఘం’ పేరిట ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖ గాయకులు తమ గానంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి స్వర నివాళి అర్పించారు. ఆయన పాడిన అమర గీతాలను ఆలపిస్తూ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ అత్యంత అందంగా రూపొందించారు. విగ్రహం రూపకల్పనలో ఎస్పీబీ యొక్క వ్యక్తిత్వం, సంగీతంపై ఆయనకున్న మక్కువను ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గతంలో హైదరాబాద్‌లో ఎస్పీబీ విగ్రహం ఏర్పాటు విషయంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి.అయితే కేరళలో మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సంగీత అభిమానులను ఆనందానికి గురి చేసింది. కళాకారుడికి ప్రాంతాలు, భాషలు అనే హద్దులు ఉండవని కేరళ ప్రజలు మరోసారి చాటి చెప్పారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు.
2020లో కరోనా కారణంగా ఆయన మరణించినప్పటికీ, ఆయన గానం మాత్రం సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.పాలక్కాడ్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆయనకు లభించిన అరుదైన గౌరవంగా నిలిచింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







