మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

- August 04, 2016 , by Maagulf
మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

భారీ వర్షాల కారణంగా సావిత్రి ఉప్పొంగడంతో బ్రిటిష్‌ కాలపు వంతెన కూలిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ముంబయి-గోవా జాతీయ రహదారిలోని రాయ్‌గడ్‌ జిల్లా మహాడ్‌ సమీపంలో సావిత్రి నదిపై ఉన్న పురాతన వంతెన మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన రెండు బస్సులతో పాటు మరో 10 వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 24 మందికి పైగా గల్లంతయ్యారు.
మరో 3 మృతదేహాలు లభ్యం ఈ దుర్ఘటనలో గల్లంతైన వారిలో మరో మూడు మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. వీటిలో ఓ మృతదేహాన్ని ఓ బస్సు డ్రైవర్‌దిగా గుర్తించారు. డ్రైవర్‌ తన కుమారుడిని కళాశాలలో చేర్పించడానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఈ దుర్ఘటనలో నిన్న ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, ఈరోజు మూడు మృతదేహాలు దొరికాయి. బస్సు డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి మృతదేహాలు సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఘటనాస్థలం నుంచి దాదాపు 50-60కి.మీల దూరంలో మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, హెలికాప్టర్లు, పడవల సాయంతో సహాయక బృందాలు గాలిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనల భద్రతను పరిశీలించాలని ఆదేశించారు.
నదిలోకి 300కేజీల అయస్కాంతం నదిలో కొట్టుకుపోయిన బస్సులను గుర్తించడం కోసం సహాయక సిబ్బంది క్రేన్‌ సహాయంతో 300 కేజీల అయస్కాంతాన్ని నదిలోకి దించారు. అయస్కాంతానికి ఏదో అతుకున్నట్లు తెలుస్తోందని.. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. నిన్నటి నుంచి జరుపుతున్న సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.a

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com