హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- April 21, 2026
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. లీజర్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. విశాలమైన హాల్, అద్భుతమైన వేదిక, సమాఖ్య సభ్యుల శ్రద్ధతో చేసిన అలంకరణలతో ఆ ప్రాంగణం మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా మారింది.. ప్రవేశద్వారంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ టేబుల్ వద్ద అతిథులను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు.
ఉత్సాహభరితమైన సంధ్యాసమయాన కార్యక్రమం వినాయక ప్రార్థనతో ప్రారంభమై, అనంతరం తెలుగు బడి విద్యార్థులు ఆలపించిన ‘మా తెలుగు తల్లి’ గీతంతో వేడుకలకు శుభారంభం లభించింది.
ఈ వేడుకలకు హాజరైన గౌరవనీయులు:
హాంకాంగ్ & మకావోలోని భారత కాన్సులేట్ జనరల్ నుండి గౌరవ కాన్సులర్, దీప్తి పెరుమాళ్; ఐలాండ్స్ ఆఫీస్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, Mr. రైర్సన్ ఇప్; తుంగ్ చుంగ్ కేర్ టీమ్ కెప్టెన్, మిస్.మే చౌ, వారందరి సాన్నిధ్యం వేడుకలకు మరింత గౌరవాన్ని చేకూర్చింది.
స్థాపక సభ్యురాలు జయా పీసపాటి సభ్యులను, అతిథులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, సమాఖ్య అభివృద్ధి పట్ల సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ సమాఖ్య, నేడు హాంకాంగ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టేందుకు కృషి చేస్తూనే వుందని పేర్కొన్నారు.
ఈ సమాఖ్య, ఒక వేదిక మాత్రమే కాదు, తనకి ఒక అద్దం, ఒక గురువు వంటిదని తెలిపారు. మాటలతోనే కాదు,ఆచరణతో నడవడం నేర్పింది. ఆఫ్రికన్ సామెత ‘వేగంగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి, దూరంగా వెళ్లాలనుకుంటే కలిసి వెళ్లండి’, భావాన్ని ఏకభవిస్తూ, నిజమైన అభివృద్ధి ఒంటరిగా జరగదని, మనం ఇతరులను వెంట తీసుకెళ్లినప్పుడు అది వికసిస్తుందని, అదే మన సిద్ధాంతం 'మన కోసం మనం' అని అన్నారు. సమాఖ్య వార్షిక కార్యక్రమాలు, పిల్లల కు తెలుగు తరగతులు మరియు స్వచ్చంద సంస్థలకు తమ సేవల గురించి ఒక చిన్న వీడియో ద్వారా తెలియజేసారు.
"ఈ ప్రయాణానికి దోహదపడిన వారందరికీ ఈ రోజు నేను ప్రత్యేక కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాను—మనకు మార్గనిర్దేశం చేసిన గురువులకు, శిష్యులకు, ప్రతి కార్యక్రమం వెనుక నిలిచిన తల్లిదండ్రులకు, మరియు తమ అదృశ్య ప్రయత్నాలతో ఈ విజయాలకి భాగస్వాములైన స్వచ్ఛంద సేవకులకు, శ్రేయోభిలాషులకు....మీలో ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధికి మూలస్తంభాలు" అని కొనియాడారు.
గౌరవ కాన్సులర్ శ్రీమతి దీప్తి పెరుమాళ్ గారు మరియు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ Mr. రైర్సన్ ఇప్ గారు, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, సమాఖ్య రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు అభినందనలు తెలిపారు. వారు సమాఖ్యకు తమ మద్దతు, ప్రోత్సాహాన్ని హృదయపూర్వకంగా ప్రకటించారు. భారత దేశం నుంచి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్తగా తెలుగు–హిందీ భాషల అభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు మరియు లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు హాంగ్ కాంగ్ తెలుగు వారందరికీ వీడియో ద్వారా తమ ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం, వారందరిని ఎంతో సంతోషింపజేసింది.
సమాఖ్య సభ్యులు చిన్న-పెద్ద అందరు ఎంతో ఉత్సాహభరితంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని, ప్రేక్షకులలో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారం ఈసారి “హనుమాన్ చారిటీ” స్థాపకులు అయిన నవీన్ సిధ్వాని మరియు మిస్ బియాంక సాధ్వని, తండ్రి-కూతురు జంటకు లభించింది. వీరు తమ వ్యక్తిగత వనరులతో వీధుల్లోని బలహీనులను ఆహారం పెట్టడం ప్రారంభించి, నేడు వందల మందికి ఆహారం అందించే స్థాయికి చేరుకున్నారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా పాల్గొన్న వారందరిని గౌరవప్రదంగా గుర్తించాక జాతీయ గీతం ఆలపించి ముగించారు. అనంతరం సమీప క్లబ్‌హౌస్‌లో సంప్రదాయ తెలుగు విందు ఏర్పాటు చేయబడింది. ఉగాది పోటీలు మరియు క్రీడా కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేయబడగా, కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
సమాఖ్య అధ్యక్షురాలు ముఖ్య అతిథులకు, డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, LCSDకు, మరియు కార్యవర్గ సభ్యులు రమేష్ రేణిగుంట్ల, రమాదేశవి సారంగా, రాజశేఖర్ మన్నే, హరీన్ తుమ్మల, అలాగే వేదిక అలంకరణ - సాంకేతిక సమన్వయం - వ్యాఖ్యాతలకు, ఫోటోగ్రఫీ, విందు ఏర్పాట్లలో సహకరించిన సభ్యులందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.






తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









