'మిషన్‌ భగీరథ'ను ప్రారంభించిన మోదీ

- August 07, 2016 , by Maagulf
'మిషన్‌ భగీరథ'ను ప్రారంభించిన మోదీ

ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ తొలి యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం కోమటిబండ గ్రామంలో ఏర్పాటుచేసిన ట్యాంకులను మోదీ ప్రారంభించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని 234 గ్రామాలకు తొలిదశగా నీరందించేలా వీటిని ఏర్పాటు చేశారు.మిషన్‌ భగీరథను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మోదీ తిలకించారు.
అనంతరం రామగుండంలోని 1600 మెగావాట్ల ఎన్టీసీపీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ శంకుస్థాపన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించారు. వరంగల్‌లోని కాళొజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభం, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లోని సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతికి అంకితం చేసే శిలాఫలకాలను మోదీ ఆవిష్కరించారు.
అంతకుముందు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో కోమటిబండ చేరుకున్న ప్రధానికి ప్రజాప్రతినిధులు పుష్ఫగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. మోదీ వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, అనంతకుమార్‌, పీయూష్‌ గోయల్‌, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. మొత్తం 40 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com