తెలుగువన్ రెండవ ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్

- May 19, 2026 , by Maagulf
తెలుగువన్ రెండవ ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్

తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం, లైఫ్‌స్టైల్ రంగాల్లో విశ్వసనీయమైన ప్లాట్‌ఫార్మ్ గా నిలిచిన తొలి తెలుగు పోర్టల్ ‘తెలుగువన్’ విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూట్యూబ్‌లో 12.3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్, భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్న ఫేస్‌బుక్ పేజ్, వేగంగా విస్తరిస్తున్న ఎక్స్ ప్రెజెన్స్, కోట్లాది వెబ్ వ్యూస్ తో తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచంలో ‘తెలుగువన్’ సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రత్యేక సందర్భంలో తెలుగువన్ వ్యవస్థాపకుడు కంఠంనేని రవిశంకర్ తమ రెండో ఫీచర్ ఫిల్మ్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే పొలిటికల్ సెటైర్ చిత్రంగా రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే దిశగా మరో అడుగు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాన్ని ప్రధానాంశంగా తీసుకుని తమ రెండో చిత్రాన్ని రూపొందించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత జనార్దన్ మహర్షి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రవిశంకర్‌తో చేతులు కలిపారు. ఇదే సమయంలో ఈ చిత్రం ద్వారా రవిశంకర్ దర్శకుడిగా పరిచయం కానుండటం విశేషం.

ఈ సందర్భంగా జనార్దన్ మహర్షి మాట్లాడుతూ.. “రవిశంకర్ గారి కష్టపడి పని చేసే తీరు, కమిట్‌మెంట్, క్రియేటివితీ, ఎప్పటికీ లొంగని తత్వం మాటల్లో చెప్పలేం. దశాబ్దం క్రితం ఆయనను కలిసినప్పుడే తెలుగు ప్రజల కోసం సమగ్ర వేదికను నిర్మించాలనే పట్టుదల నన్ను ఆశ్చర్యపరిచింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఆయన ఆలోచనల లోతు నాకు మరింత అర్థమైంది. మొదట నేను నా కథతో ఆయనను సంప్రదించాను. కానీ ఆయన చెప్పిన విజన్ వెంటనే నన్ను ఆకట్టుకుంది”  

అలాగే కథ గురించి మాట్లాడుతూ.. “మనుషులు సృష్టించిన పర్యావరణ సంక్షోభానికి ప్రకృతిలోని పంచభూతాలు ఎలా స్పందిస్తాయన్న ఆలోచన చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన కథ. స్క్రీన్‌ప్లే కూడా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. రవిశంకర్ తన ఆలోచనలను మాటల్లోనే కాదు, విజువల్‌గా కూడా అద్భుతంగా వ్యక్తపరచగలరు. అందుకే ఈ కథను ఆయనే దర్శకత్వం వహించాలని నేను ప్రోత్సహించాను” అన్నారు.

కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ.. “తెలుగువన్ కుటుంబంతో కలిసి నేర్చుకుంటూ, ఎదుగుతూ ప్రయాణిస్తున్న 26 ఏళ్ల యువకుడిని నేను. తెలుగువన్ ఎప్పుడూ తన విలువలకు కట్టుబడి ఉంటుంది. మేము కేవలం డబ్బు కోసం సినిమాలు నిర్మించడం లేదు. ప్రేక్షకులు కథలతో కనెక్ట్ కావాలి. సమాజంలోని సమస్యలపై అవగాహన తీసుకురావాలి. సామాజిక బాధ్యత తెలుగువన్‌కు ఎంతో ముఖ్యమైనది. మా రెండో చిత్రం కూడా అదే దిశగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తామని పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను. మా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు ఇచ్చిన ప్రేమ, ఆదరణను ఈ సినిమాకి కూడా ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నాను. జనార్దన్ మహర్షి గారి మార్గదర్శకత్వంలో ఒక థ్రిల్లింగ్, ఎంగేజింగ్, అవసరమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలనుకుంటున్నాను” అన్నారు.

ఈ చిత్రాన్ని కె. హిమబిందు సమర్పిస్తుండగా, వై. జితిన్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగువన్ డైరెక్టర్ రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను జూన్ రెండో వారంలో వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రచయిత: జనార్దన్ మహర్షి
కాన్సెప్ట్-డైరెక్టర్-నిర్మాత:  కంఠంనేని రవిశంకర్
సహ నిర్మాత: వై. జితిన్ కుమార్
సమర్పణ: కె. హిమ బిందు
నిర్మాణ సంస్థ: తెలుగువన్ ప్రొడక్షన్స్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com