ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

- June 04, 2026 , by Maagulf
ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల నుంచి, గ్రామీణ ప్రజల ఆర్థిక భరోసాను పెంచే సంక్షేమ పథకాల వరకు దాదాపు 35కు పైగా అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి పచ్చజెండా ఊపింది. సమావేశం ముగిసిన అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమగ్రంగా వెల్లడించారు.

లండన్ ఐ తరహాలో ‘అమరావతి ఐ’.. రాజధాని నిర్మాణ పనులకు భారీ నిధులు
ప్రపంచ పర్యాటక పటంలో అమరావతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా కృష్ణా నది తీరాన ఆరు ఎకరాల విస్తీర్ణంలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. లండన్, దుబాయ్ నగరాల్లోని ఐకానిక్ వీల్స్ తరహాలో దీనిని DBFOT (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో 30 ఏళ్ల లీజు ప్రాతిపదికన నిర్మించనున్నారు. దీనితో పాటు రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ.. హైకోర్టు భవన బాహ్య సుందరీకరణ కోసం రూ. 547 కోట్లు, ఐఏఎస్ అధికారుల నివాసాల్లో ఆధునిక సౌకర్యాల కోసం రూ. 94.90 కోట్లు మంజూరు చేశారు. అలాగే, అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ కోసం ఏపీఐఐసీకి 8 ఎకరాల భూమిని కేటాయించారు. దీనిని 9-10 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

ఉపాధి హామీ 125 రోజులకు పెంపు.. కూలీలకు ఆర్థిక భరోసా
గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (VBG-RAMAJI) పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచారు. ఫలితంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి అదనంగా రూ. 7,675 లబ్ధి చేకూరుతుంది. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని, ఆలస్యమైతే రోజుకు 0.05% చొప్పున వడ్డీ చెల్లించాలనే నిబంధనను కూడా చేర్చారు.

సరికొత్త పాలసీలు: విమానయానం, బీచ్ షాక్స్ మరియు అవయవదాన చట్టం
రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధి కోసం కేబినెట్ పలు కొత్త విధానాలను తీసుకొచ్చింది. 2035 నాటికి ప్యాసింజర్ మార్కెట్ వాటాను 4 శాతానికి, ఎయిర్ కార్గో వాటాను 5 శాతానికి పెంచడమే లక్ష్యంగా కొత్త ఏవియేషన్ పాలసీని తెచ్చారు. దీని ద్వారా కొత్త ఎయిర్‌పోర్టులు, వాటర్ డ్రోమ్‌లను అభివృద్ధి చేస్తారు. గోవా తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తొలి దశలో చీరాల (సూర్యలంక), విశాఖపట్నం బీచ్‌లలో రెండేసి చొప్పున బీచ్ షాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. అవయవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘ది ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్-2011’ను రాష్ట్రంలో ఆర్డినెన్స్ రూపంలో అమలు చేయనున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. పోలవరం పనులకు అదనపు నిధులు
వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి రంగాలకు కేబినెట్ పెద్దపీట వేసింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజీ 5, 5A పనుల అంచనా వ్యయాన్ని రూ. 352.6 కోట్ల నుంచి రూ. 796.66 కోట్లకు సవరిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ కేసుల వేగవంతమైన పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ 21 పోస్టులను మంజూరు చేశారు. దీనిపై మంత్రులతో ఒక సబ్ కమిటీని కూడా సీఎం ఏర్పాటు చేశారు. అలాగే, నెడ్‌క్యాప్ ద్వారా సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలకు భూముల లీజు ప్రతిపాదనలను ఆమోదించారు.

ప్రైవేట్ వర్సిటీ, భూముల రీ-క్లాసిఫికేషన్ మరియు ఇతర నిర్ణయాలు
మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో అంతర్జాతీయ ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కోసం రూ. 10 కోట్లు కేటాయించారు.గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని 25 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ‘గ్రామ కంఠం’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి భూ సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. వీటితో పాటు అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి 66 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com