లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో మాగల్ఫ్ ముఖాముఖీ
- June 16, 2026
'సింగ్ గీతం' ఘన విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా 40 ఏళ్ల కలని సాకారం చేసిన ఘనత అశ్విన్ గారిదే. ఈ సినిమా ఈ క్రెడిట్ మొత్తం ఆయనే చెందుతుంది. సింగ్ గీతం విలువైన సినిమాగా నిలుస్తుంది: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘సింగ్ గీతం’ చాలా ఆసక్తికరంగా వుంది. కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మీలాంటి లెజెండరీ దర్శకుడికి ఇది పర్ఫెక్ట్ మూవీ.ఈ కథ 40 ఏళ్లుగా తెరపైకి రావడానికి ఎదురుచూస్తోందని చెప్పారు. ఆ ఆలోచన ఎలా పుట్టింది?
-సుమారు 40 ఏళ్ల క్రితం నాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా, సినిమాలోని ప్రతి సంభాషణను మాట్లాడకుండా పూర్తిగా పాట రూపంలో చెప్పాలని అనుకున్నాను. బ్రాడ్‌వే మ్యూజికల్స్‌లో పాటలు, సంభాషణలు వేరుగా ఉంటాయి. కానీ నేను మాత్రం ప్రతి మాటను పాడుతూ చెప్పే సినిమా చేయాలని కలగన్నాను. ఆ ఆలోచన నాతోనే దాదాపు 40 ఏళ్ల పాటు ప్రయాణించింది. మద్రాస్‌లోనూ, నా ఇంట్లోనూ, ఎన్నో చోట్ల ఈ కథ నా వెంట తిరిగింది. చివరికి నాగ్ అశ్విన్ దృష్టికి వెళ్లింది. ఆయన ఈ ఆలోచనను ఎంతో ఇష్టపడి, గొప్ప అభిరుచితో ముందుకు తీసుకెళ్లారు. ఆయన సంపూర్ణ సహకారం, నమ్మకం లేకపోతే ఈ సినిమా అసలు రూపుదాల్చేది కాదు. ‘సింగ్ గీతం’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్.
పదేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది? ఈ సినిమా కోసం తీసిన మొదటి షాట్ గురించి గుర్తుందా?
-నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించాలని కోరారు. నాకు ఇప్పటికీ దర్శకత్వం వహించే ఉత్సాహం ఉంది. అయితే నా వయస్సు దృష్ట్యా సాంకేతిక సహకారంతో ఆన్‌లైన్‌లో సినిమా తెరకెక్కించే విధానాన్ని నాగ్ అశ్విన్ ఏర్పాటు చేశారు. నా హోమ్ థియేటర్‌లో కూర్చుని, షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు సూచనలు ఇచ్చేవాడిని. అక్కడి కెమెరాలు, మానిటర్లు అన్నీ నాకు కనెక్ట్ అయ్యేవి. ఇంట్లో నుంచే మొత్తం సినిమాను దర్శకత్వం వహించాను. ఇది అద్భుతమైన మేనేజ్‌మెంట్. ఇలాంటి విధానాన్ని సాధ్యంచేసింది నాగ్ అశ్విన్ మాత్రమే.
మీ సినిమాల్లో నటీనటుల ఎంపికకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కమల్ హాసన్, డా. రాజ్‌కుమార్, బాలకృష్ణ వంటి మహానటులతో పనిచేశారు. దర్శకుడు-నటుడు అనుబంధం గురించి చెప్పండి.
-ప్రతి నటుడికి తనదైన వ్యక్తిత్వం, ప్రత్యేకత, శైలి ఉంటాయి. బాలకృష్ణ గారు కమల్ హాసన్ గారిలా ఉండరు. కమల్ హాసన్, డా.రాజ్‌కుమార్ లా ఉండరు.ముగ్గురూ గొప్ప నటులే కానీ వారి నటనా శైలులు భిన్నం.దర్శకుడిగా నా పని ఏమిటంటే, ప్రతి నటుడిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి, దాన్ని అత్యుత్తమంగా బయటకు తీసుకురావడం. వారి ప్రతిభను మరింత వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించాను. అదే నా విజయానికి కారణం.
‘సింగ్ గీతం’లో ఎక్కువగా కొత్త నటీనటులు కనిపిస్తున్నాయి.ఈ కాస్టింగ్ గురించి చెప్పండి?
-ఈ సినిమా ఆలోచనే పాటల ద్వారా కథ చెప్పడం. అందుకే నటీనటుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటుడు తన పాత్రకు సంబంధించిన పాటలను స్వయంగా పాడారు. సాధారణంగా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి నటుడు తన పాత్ర భావాలను స్వయంగా ఆలపించారు. అందుకే నటులు, గాయకులు రెండూ ఒక్కరే అయ్యారు. అదే ఈ చిత్ర ప్రత్యేకత.
‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి వినూత్న చిత్రాలతో భారతీయ సినిమాకు ఎన్నో కొత్త ప్రయోగాలు పరిచయం చేశారు. ఇలా కొత్త ఆలోచనలతోనే సినిమాలు చేయడం మీకు ఇష్టమా?
-అవును.కేవీ రెడ్డి వద్ద పనిచేసిన రోజుల నుంచే కొత్త ఆలోచనల పట్ల ఆసక్తి ఉండేది. ‘మాయాబజార్’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాల కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనే ఉండేది. అందుకే ప్రతి సినిమాతో కొత్త ప్రయోగం చేయాలనే తపన ఉండేది. ‘మాయాబజార్’ కాలం నుంచే ఆ ఆలోచనా విధానం నాలో పెరిగింది. కొత్తదనం కోసం వెతకడం, ప్రేక్షకులకు ఎప్పుడూ చూడని అనుభూతిని ఇవ్వడం నా సినీ ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా మారింది.
ఇలాంటి వినూత్నమైన మ్యూజికల్ చిత్రంతో మళ్లీ దర్శకుడిగా తిరిగి రావాలనుకోవడానికి కూడా ఇదే ఆలోచనా కారణమా?
-అవును.కానీ ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, చాలా కాలంగా నా మనసులో ఉన్న కల. సినిమాలోని ప్రతి సంభాషణను నటీనటులే పాడుతూ చెప్పే చిత్రాన్ని రూపొందించాలని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాను. ఈ ఆలోచనలో ఉన్న కొత్తదనం నన్నెంతో ఆకర్షించాయి. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఈ కల కన్నాను. అయితే దాన్ని సాకారం చేసిన ఘనత మాత్రం పూర్తిగా నాగ్ అశ్విన్‌దే. ఆయన ఆసక్తి చూపి, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లి, దానికి జీవం పోశారు. అందుకు పూర్తి క్రెడిట్ ఆయనకే చెందుతుంది.
మ్యూజికల్స్ పట్ల మీకున్న ప్రత్యేకమైన ఆసక్తి గురించి చెప్పండి. అలాగే మీకు ఇష్టమైన మ్యూజికల్స్ ఏవైనా ఉన్నాయా?
-కాలేజ్ రోజుల నుంచే మ్యూజికల్స్ అంటే నాకు చాలా ఇష్టం. జీన్ కెల్లీ వంటి దిగ్గజ కళాకారుల బ్రాడ్‌వే మ్యూజికల్స్‌ను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని. అయితే వాటిలో పాటలు, సంభాషణలు వేరుగా ఉండేవి. సంగీతానికి ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది. అది నాకు ఎంతో ఉత్సాహాన్ని, భావోద్వేగాన్ని కలిగించేది. భారతీయ సినిమాల్లో చూస్తే, దాదాపు ప్రతి సినిమాలో పాటలు ఉంటాయి. అందుకే మన దగ్గర ‘మ్యూజికల్’ అనే ప్రత్యేక జానర్ లేదు. కానీ నేను మాత్రం సంభాషణలు వేరుగా, పాటలు వేరుగా కాకుండా మొత్తం కథనే పాటల రూపంలో చెప్పాలనుకున్నాను. నటులు మాట్లాడకుండా పాడుతూ కథను ముందుకు తీసుకెళ్లడం అనే కొత్త ఆలోచనే ‘సింగ్ గీతం’కి జీవం పోసింది.
సాహిత్యం, ప్రపంచ సినిమా పట్ల మీకున్న అభిమానం మీ సృజనాత్మక ఆలోచనలపై ఎలా ప్రభావం చూపింది?
-నేను కాలేజ్‌కి వెళ్లే వరకు తెలుగు సినిమాలే ఎక్కువగా చూశాను. మద్రాస్‌కి వచ్చిన తర్వాత తమిళ సినిమాలు, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు చూడటం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో దాదాపు 80 శాతం హాలీవుడ్ చిత్రాలే చూసేవాడిని. ‘గాన్ విత్ ది విండ్’, ‘ఫ్రం హియర్ టు ఈటర్నిటీ’ వంటి ఆస్కార్ విజేత క్లాసిక్ చిత్రాలను మళ్లీ మళ్లీ చూసి ఆస్వాదించేవాడిని. అవి నాపై ఎంతో ప్రభావం చూపాయి. అయితే 1951లో తొలిసారి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్నప్పుడు ప్రపంచ సినిమా వైవిధ్యాన్ని చూసే అవకాశం వచ్చింది. జపాన్, ఇరాన్, మెక్సికో, శ్రీలంక వంటి దేశాల సినిమాలను చూసిన తర్వాత ప్రపంచ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల కంటే ప్రపంచ సినిమా నన్ను ఎక్కువగా ఆకర్షించింది.
మీ సుదీర్ఘ కెరీర్‌లో మీకు అనిపించినట్లుగా తగిన గుర్తింపు పొందని సినిమా ఏదైనా ఉందా?
-నిజానికి నేను తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. నేను నమ్మని సినిమా ఎప్పుడూ తీయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు నా ఆలోచనతో ఏకీభవించలేదు. ఉదాహరణకు నా తొలి చిత్రం ‘నీతి-నిజాయితీ’. ఆ చిత్రాన్ని మేధావులు ఎంతో ప్రశంసించారు. విమర్శకులు, మీడియా, పత్రికలు ప్రశంసల వర్షం కురిపించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అది పెద్ద పరాజయం పొందింది. ప్రేక్షకులు అంగీకరించకపోతే మిగతా ప్రశంసలన్నీ వృథా అవుతాయని అప్పుడు అర్థమైంది.
తెలుగు సినిమాలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్న నాగ్ అశ్విన్, స్వప్న దత్, ప్రియాంక దత్‌లతో పనిచేయడం ఎలా అనిపించింది?
-నా మొత్తం సినీ ప్రయాణంలో అత్యంత సంతృప్తినిచ్చిన కాలం ఇదే అని చెప్పగలను. అశ్వినీదత్ గారు, ప్రియాంక దత్, స్వప్న దత్, నాగ్ అశ్విన్‌లతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. వారికి మంచి సినిమా అంటే అపారమైన ప్రేమ. సినిమా ఎంత వసూలు చేస్తుంది? ఎంత పెద్ద హిట్ అవుతుంది? అనే విషయాల కంటే మంచి సినిమా తీయాలనే తపన ఎక్కువ. అదే వారి అభిరుచి, అదే వారి ప్యాషన్.
ఆ ప్యాషన్ నన్నెంతో ఆకట్టుకుంది. అలాంటి వారితో కలిసి సినిమా చేసే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
కథ చెప్పే విధానం, సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న కాలంతో పాటు భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమాను మీరు ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం చిత్ర నిర్మాణంలో మీకు నచ్చుతున్న మార్పు ఏది?
-సాంకేతికంగా చూస్తే, ‘మాయాబజార్’ రోజుల్లో నేను చూసిన సినిమా ప్రపంచానికి, నేటి సినిమాలకు చాలా తేడా ఉంది. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అయితే ఈ ప్రయాణంలో వ్యక్తిగత భావోద్వేగాలు, సహజత్వం కొంత మేర తగ్గిపోయాయేమో అనిపిస్తుంది.
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేటి సినిమాల్లో సాంకేతిక అద్భుతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. కానీ అవి ఎక్కువగా హీరో ఎలివేషన్లు, భారీ పాత్రల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఉండే సహజమైన జీవితం, మనుషుల భావోద్వేగాలను ప్రతిబింబించే సినిమాలు ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఇటీవల భారతీయ సినిమాలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న చిత్రాలు ఏవి?
-ఇటీవల నన్ను అత్యంతగా ఆకట్టుకున్న సినిమాలు ‘పుష్ప 2’, ‘కాంతార’. ప్రత్యేకంగా ‘పుష్ప 2’లో పాత్ర చిత్రణ చాలా నచ్చింది. అలాగే ‘కాంతార’ అద్భుతమైన చిత్రం. ఆ సినిమాలోని భావోద్వేగాలు, పాత్రల రూపకల్పన, కథనం ఎంతో బలంగా ఉన్నాయి.
మీ సినిమాలు వేర్వేరు తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా తెరకెక్కించే సమయంలో మారుతున్న ప్రేక్షకుల గురించి ఆలోచిస్తారా? ఉదాహరణకు ‘సింగ్ గీతం’ జనరేషన్-Z ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ పై చూసే తొలి భారతీయ మ్యూజికల్ కావచ్చు కదా?
-ఖచ్చితంగా. నిజానికి ఈ సినిమా ప్రధానంగా జనరేషన్-Z ప్రేక్షకుల కోసమే రూపొందింది. ఈ చిత్రం తన కాలానికి చాలా ముందున్న ఆలోచనతో రూపొందింది. ఇది భవిష్యత్ ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఇది పెద్ద విజయాన్ని అందుకుంటోంది. కానీ కాలం గడిచేకొద్దీ ఇది ఇంకా పెద్ద విజయంగా, మరింత విలువైన చిత్రంగా గుర్తింపు పొందుతుందని నేను నమ్ముతున్నాను.
80 ఏళ్ల వయసులో యానిమేషన్ కోర్సులు నేర్చుకోవడం, 90 ఏళ్ల వయసులో మళ్లీ మ్యూజికల్ చిత్రాన్ని తెరకెక్కించడం... వయసు ఎప్పుడూ మిమ్మల్ని ఆపలేదు. మీలోని ఆ యువతర ఉత్సాహం, కొత్తదనంపై ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
-దానికి ఒకే ఒక సమాధానం—ప్యాషన్.కొత్తగా ఏదైనా చేయాలి, ఎవరూ చేయని పని చేయాలి, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలి అనే తపనే నన్ను ఎప్పుడూ ముందుకు నడిపించింది. ‘పుష్పక విమానం’, ‘అపూర్వ సహోదరులు’, ‘మైకేల్ మదన కామరాజు’, ‘మయూరి’ నుంచి ఈరోజు ‘సింగ్ గీతం’ వరకు నేను చేసిన ప్రతి ప్రయోగం వెనుక అదే ప్యాషన్ ఉంది. కొత్తదనం కోసం వెతకడం, కొత్త మార్గాలను అన్వేషించడం ఎప్పటికీ ఆగలేదు. అదే నన్ను ఇప్పటికీ సినిమాల వైపు నడిపిస్తోంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు









