తెలంగాణలో పుష్కరాల ముహూర్తం రేపు ఉదయం 5:55 గంటల నుంచి 6 గంటల మధ్య

- August 11, 2016 , by Maagulf
తెలంగాణలో పుష్కరాల ముహూర్తం రేపు ఉదయం 5:55 గంటల నుంచి 6 గంటల మధ్య

తెలంగాణలో కృష్ణాపుష్కరాలకు సర్వం సిద్దమైంది. కృష్ణా నదిలో జళకళ ఉట్టిపడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో రేపు తెల్లవారుజామున సీఎం కేసీఆర్, పీఠాధిపతులు పుణ్యస్నానాలు చేసి పుష్కరాలను ప్రారంభిస్తారు. తెలంగాణలో పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 5:55 గంటల నుంచి 6 గంటల మధ్య పుష్కరాలు ప్రారంభిస్తారు. మొదటగా మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల వద్ద పీఠాధిపతులు, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యస్నానం చేస్తారు. పుష్కరస్నానం చేసేందుకు ఈరోజు మధ్యాహ్నమే సీఎం కేసీఆర్ ఆలంపూర్ చేరుకుని జోగులాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే బస చేసే అవకాశం కూడా ఉంది. అక్కడి నుంచి ఉదయం 5 గంటలకల్లా సమీపంలోని గొందిమళ్ల ఘాట్‌కు వెళ్తారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఇటు పవిత్ర కృష్ణా పుష్కరాల కోసం పాలమూరు జిల్లాలోని ఘాట్లు సిద్దమయ్యాయి. పుష్కరుడు కృష్ణానదిలో కలిసే శుక్రవారం నుంచి జిల్లాలోని 52ఘాట్లలో అశేషంగా భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రతీ పుష్కరఘాట్‌ కూడా సుందరంగా ముస్తాబైంది. రాత్రుళ్లు పుష్కరఘాట్లన్నీ విద్యుత్ వెలుగులతో జిగేల్మంటున్నాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న బీచ్‌పల్లి, రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లలో కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలిపుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల్లో కేసీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో పుష్కరఘాట్లకు సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. మొబైల్ యాప్‌లను కూడా ఆవిష్కరించారు. తెలంగాణలో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కొన్నిచోట్ల పుష్కరఘాట్లు నీటిలో మునిగాయి. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ఘాట్లలో రక్షణ చర్యల కోసం మరింత మందిని నియమిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com