ఒమన్‌లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్‌లపై ఆంక్షలు..!!

- August 17, 2026 , by Maagulf
ఒమన్‌లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్‌లపై ఆంక్షలు..!!

మస్కట్: ఒమన్‌లో టెలికమ్యూనికేషన్స్ వినియోగదారుల డేటా రక్షణతో పాటు అనవసరమైన ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) డెసిషన్ నంబర్ 1511/25/2/36/2026 కింద ‘ప్రమోషనల్ కాల్స్, సర్వీస్ మెసేజెస్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్’పై కొత్త రెగ్యులేషన్ జారీ చేసింది. ఈ నిబంధనలతో వినియోగదారుల డేటాకు మరింత రక్షణ కల్పించడంతో పాటు.. మోసపూరిత కాల్స్, స్పామ్ మెసేజ్‌లు, అనవసరమైన ప్రచార కమ్యూనికేషన్లకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు TRA వెల్లడించింది.

కస్టమర్ డేటా షేరింగ్‌పై ఆంక్షలు

వినియోగదారుల సమాచారాన్ని వారి ముందస్తు అనుమతి లేకుండా స్థానిక లేదా అంతర్జాతీయ సబ్‌స్క్రైబర్లకు, అంతర్జాతీయ మధ్యవర్తులకు షేర్ చేయరాదు. లైసెన్స్ పొందిన టెలికాం సంస్థలు వినియోగదారుల డేటాను రక్షించేందుకు తగిన సాంకేతిక, సంస్థాగత చర్యలు తీసుకోవాలి.

ప్రమోషనల్ మెసేజ్‌లు పంపే సంస్థలు తమ చట్టపరమైన లేదా వాణిజ్య పేరును స్పష్టంగా తెలియజేసే ఐడెంటిఫైయర్‌ను ఉపయోగించాలి. మార్కెటింగ్ మెసేజ్‌లను సాధారణ కమ్యూనికేషన్ల నుంచి సులభంగా గుర్తించేలా ప్రత్యేకంగా రూపొందించాలి. వాల్యూ యాడెడ్, రికరింగ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసులకు సంబంధించి కూడా స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధిత సంస్థలు అవసరమైన అనుమతులు పొందడంతో పాటు.. ఆ సేవలను అనుమతించిన ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి.

అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా మెసేజ్‌ల మార్పిడికి ఒప్పందాలు చేసుకునే ముందు టెలికాం ఆపరేటర్లు TRA అనుమతి పొందాలి. మెసేజ్ పంపిన వారి గుర్తింపును ధృవీకరించడం, నకిలీ గుర్తింపులు, మోసపూరిత సందేశాల ప్రసారాన్ని అడ్డుకునే చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు, వాల్యూ యాడెడ్ సర్వీసుల నుంచి తప్పుకునేందుకు వినియోగదారులకు సులభమైన మార్గాలను సర్వీస్ ప్రొవైడర్లు అందించాలి. ఆప్ట్‌అవుట్ చేసిన తర్వాత కూడా మెసేజ్‌లు లేదా కాల్స్ వస్తే వాటిని ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించాలి.

ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను ఒమన్ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే చేయాలి. నిర్ణీత సమయాలకు వెలుపల వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిబంధన తీసుకొచ్చారు.

స్పామ్, మోసపూరిత కాల్స్‌కు చెక్

మోసపూరిత, అనవసరమైన కాల్స్, మెసేజ్‌లను గుర్తించి అడ్డుకునే సాంకేతిక వ్యవస్థలను టెలికాం ఆపరేటర్లు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల ఫిర్యాదుల కోసం ఏకీకృత రిపోర్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు.. ఆపరేటర్ల మధ్య సమాచార మార్పిడి, సహకారాన్ని కూడా ప్రోత్సహించాలని TRA సూచించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి నేర తీవ్రతను బట్టి OMR500 నుంచి OMR30,000 వరకు జరిమానా విధించనున్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై మరింత కఠినమైన చర్యలు తీసుకునే అధికారం TRAకు ఉంటుంది. వాణిజ్య కమ్యూనికేషన్ల అవసరాలను, వినియోగదారుల గోప్యత, భద్రత, అనవసరమైన కాల్స్‌ నుంచి రక్షణ హక్కులను సమతుల్యం చేస్తూ ఒమన్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కొత్త నిబంధనల ఉద్దేశమని TRA తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com