ఖతార్‌లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!

- August 17, 2026 , by Maagulf
ఖతార్‌లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!

దోహా: ఖతార్‌లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన లేదా మృతిచెందిన వారి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని న్యాయ నిపుణురాలు హెచ్చరించారు. చట్టపరమైన అనుమతి లేకుండా ప్రమాద బాధితులను చిత్రీకరించడం నేరమని స్పష్టం చేశారు. న్యాయవాది, లీగల్ కన్సల్టెంట్ ఖదీజా అల్ సాయెగ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినప్పుడు మొబైల్ తీసి వీడియోలు తీయడం కంటే వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాద దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని కొందరు చెప్పినా.. ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు.

రెండేళ్ల వరకు జైలు.. QR10,000 ఫైన్

ఖతార్ పెనల్ కోడ్‌లోని ఆర్టికల్ 333 ప్రకారం.. ప్రమాదాల్లో గాయపడిన లేదా మృతిచెందిన వారి ఫొటోలు, వీడియోలను చట్టం అనుమతించిన పరిస్థితులు మినహా తీయడం లేదా ప్రసారం చేయడం నేరం. దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా QR10,000 వరకు జరిమానా లేదా రెండింటిలో ఏదైనా ఒకటి విధించవచ్చు. అలాగే ఇతరులను అవమానించడం, పరువు తీసే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో వారి ఫొటోలు, వీడియోలు తీయడం లేదా ప్రసారం చేయడంపైనా చట్టం ఆంక్షలు విధిస్తుంది.

అయితే ప్రమాదాన్ని అధికారులకు నివేదించేందుకు అవసరమైన ఫొటోలు తీయడంపై మినహాయింపు ఉంది. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం.. మెట్రాష్ యాప్ ద్వారా ప్రమాదాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు వాహనం నంబర్‌తో పాటు ప్రమాద స్థలానికి సంబంధించిన గరిష్ఠంగా నాలుగు ఫొటోలను జత చేయవచ్చు. అయితే ఆ ఫొటోల్లో ప్రయాణికులు లేదా ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులు కనిపించకూడదు. ప్రమాదాల సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా మెట్రాష్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

 ప్రమాద బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వారి కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక వేదన కలిగించవచ్చని అల్ సాయెగ్ పేర్కొన్నారు. అధికారికంగా సమాచారం అందకముందే సోషల్ మీడియాలో తమ కుటుంబ సభ్యుడి గాయాలు లేదా మరణానికి సంబంధించిన దృశ్యాలను చూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు.

ధృవీకరించని సమాచారం, వీడియోలు, సందేశాలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసే విషయంలోనూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని న్యాయ నిపుణురాలు హెచ్చరించారు. తనకు ఎవరో ఒకరు సమాచారం పంపినంత మాత్రాన దాన్ని వెంటనే ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదని సూచించారు. సమాచారం నిజమా? దాన్ని ప్రచారం చేయడం వల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందా? అనే విషయాలను ముందుగా పరిశీలించాలని తెలిపారు. “నేను కేవలం ఫార్వర్డ్ చేశాను” అని చెప్పడం ద్వారా చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకోలేమని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ప్రమాదాలు, ఇతర ఘటనలు జరిగిన ప్రాంతాల్లో గుమిగూడడం, అక్కడి పరిస్థితులను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంపై హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యల వల్ల అంబులెన్సులు, సివిల్ డిఫెన్స్, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోవడంలో ఆలస్యం జరిగి ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ఏ సమాచారమైనా క్షణాల్లో విస్తృతంగా వ్యాపించే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ రోజువారీ చర్యలకు సంబంధించిన చట్టాలను ప్రాథమికంగా తెలుసుకోవాలని అల్ సాయెగ్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com