ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- July 08, 2026
సౌదీ అరేబియా: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు కార్మికులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్న రాజన్న పులి సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించగా, 44 ఏళ్లుగా స్వదేశానికి రాలేకపోయిన సిద్ధిపేట జిల్లా వాసి బొట్ల చంద్రయ్య మృతదేహం కూడా భారత్‌కు తరలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం మారంపల్లి గ్రామానికి చెందిన చిన్న రాజన్న పులి (57) 2013లో కుటుంబ పోషణ కోసం సౌదీ అరేబియాలోని తబుక్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లారు. జూన్ 22న తన గదిలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రోజుల తరబడి చివరి చూపు కోసం ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు రాజన్న మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లిన రాజన్న శవపేటికలో తిరిగి రావడం గ్రామంలో విషాదాన్ని నింపింది.ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.
రాజన్న మృతదేహాన్ని భారత్‌కు తరలించడంలో ఆయన పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయం, గల్ఫ్ వర్కర్స్ అవేర్‌నెస్ కమిటీ (GWAC) కార్యకర్తలు మహమ్మద్ ఫారూఖ్, అబ్దుల్ రఫీక్, సహోద్యోగి నవీన్ తదితరులు కీలక సహకారం అందించారు.
ఇదిలా ఉండగా, ఉమ్మడి మెదక్ జిల్లా (ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం) చెల్లాపూర్ గ్రామానికి చెందిన బొట్ల చంద్రయ్య 44 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడే జీవనం సాగించారు. గత నెలలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
చంద్రయ్య వద్ద పాస్‌పోర్ట్, అకామా వంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ఆయన కుటుంబాన్ని గుర్తించడం కష్టమైంది. అయితే 1992లో పాస్‌పోర్టు పునరుద్ధరణ రికార్డుల ఆధారంగా భారత రాయబార కార్యాలయం, కేరళకు చెందిన నాజ్ షుకత్ సహకారంతో ఆయన కుటుంబ సభ్యులను గుర్తించారు.
చంద్రయ్య మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులు, GWAC ప్రతినిధులు మహమ్మద్ ఫారూఖ్, బుర్ర తిరుపతి గౌడ్, వేముల శంకర్, అబ్దుల్ రఫీక్, రంజిత్ కుమార్, దుబ్బాక రెండో వార్డు కౌన్సిలర్ కనకరాజు, చంద్రయ్య సోదరుడు తదితరులు కృషి చేశారు.
ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రత్యేక సహాయ పథకాలు అమలు చేయాలని, చంద్రయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కూడా సంస్థ ప్రతినిధులు కోరారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







