77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- July 15, 2026
దుబాయ్: యూఏఈ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని యూఏఈ అంతటా బుధవారం (జూలై 15) ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఎడారిని ప్రపంచ ఆర్థిక, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా మార్చిన దూరదృష్టి నాయకుడిగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
1949 జూలై 15న దుబాయ్‌లోని అల్ షిందాఘా ప్రాంతంలో జన్మించిన షేక్ మహ్మద్, చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. తండ్రి, దుబాయ్ మాజీ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్, తల్లి షేఖా లతీఫా బింట్ హమ్దాన్ అల్ నహ్యాన్ ప్రభావం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. తాత షేక్ సయీద్ మజ్లిస్ సమావేశాల్లో పాల్గొంటూ పాలన, ప్రజాసేవ, బాధ్యతలపై విలువైన పాఠాలు నేర్చుకున్నారు.
ప్రాథమిక విద్యను దుబాయ్‌లో పూర్తి చేసిన అనంతరం, 1966లో బ్రిటన్‌కు వెళ్లి సైనిక శిక్షణ పొందారు. కేంబ్రిడ్జ్‌లోని బెల్ స్కూల్లో చదివి, అనంతరం మాన్స్ ఆఫీసర్ క్యాడెట్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసి అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా "స్వోర్డ్ ఆఫ్ ఆనర్" పురస్కారాన్ని అందుకున్నారు.
1968లో కేవలం 19 ఏళ్ల వయసులో దుబాయ్ పోలీస్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 1971లో యూఏఈ ఏర్పాటుతో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆ బాధ్యతలను నిర్వహించి, 2024లో ఆ పదవిని తన కుమారుడు, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్‌కు అప్పగించారు.
దుబాయ్ విమానాశ్రయ అభివృద్ధి, ఓపెన్ స్కైస్ పాలసీ, జెబెల్ అలీ ఫ్రీ జోన్ విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి వంటి కీలక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. దుబాయ్‌ను ప్రపంచ విమానయాన, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర విశేషమైనది.
1995లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, దుబాయ్ మీడియా సిటీ, బిజినెస్ బే, దుబాయ్ మెరీనా, బుర్జ్ అల్ అరబ్, పామ్ ఐలాండ్స్, బుర్జ్ ఖలీఫా వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసి దుబాయ్‌ను ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపారు.
2006 జనవరి 4న దుబాయ్ రూలర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ మహ్మద్, అదే సమయంలో యూఏఈ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రిగా కూడా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో యూఏఈ విజన్ 2021, స్మార్ట్ గవర్నమెంట్, డిజిటల్ సేవలు, ఆర్థిక వైవిధ్యీకరణ వంటి అనేక సంస్కరణలు అమలయ్యాయి. నేడు యూఏఈ ప్రపంచంలో అత్యంత పోటీ సామర్థ్యం కలిగిన దేశాల్లో ఒకటిగా నిలవడానికి ఆయన దూరదృష్టి ప్రధాన కారణంగా భావిస్తారు.
పాలనతో పాటు షేక్ మహ్మద్ ప్రముఖ నబాతీ కవిగానూ గుర్తింపు పొందారు. ఆయన రచించిన అనేక కవితలకు ప్రముఖ అరబ్ గాయకులు స్వరాలు అందించి ప్రజాదరణ పొందాయి. అలాగే గుర్రపు స్వారీ, ఎండ్యూరెన్స్ రేసింగ్‌పై ఆయనకు అపారమైన ఆసక్తి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత గొడోల్ఫిన్ రేసింగ్ జట్టును స్థాపించడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రైజ్ మనీ కలిగిన దుబాయ్ వరల్డ్ కప్ గుర్రపు పందెాన్ని ప్రారంభించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు.
ప్రస్తుతం కూడా షేక్ మహ్మద్ ప్రజా సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సేవల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇస్తూ దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. "పౌరుడే మొదటి ప్రాధాన్యం", "దేశ నిర్మాణమే జీవితంలో అత్యున్నత లక్ష్యం" అనే ఆయన సిద్ధాంతాలు యూఏఈ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచాయి.
77వ జన్మదినాన్ని పురస్కరించుకుని యూఏఈ ప్రజలు, వివిధ దేశాల నాయకులు, ప్రముఖులు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు దీర్ఘాయుష్షు, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్‌పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







