యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు

- July 27, 2026 , by Maagulf
యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు

అబుదాబి: యూఏఈలో గృహ కార్మికుల నియామక సంస్థలపై కార్మిక మరియు ఎమిరాటీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) కఠిన చర్యలు చేపట్టింది. 2026 తొలి ఆరు నెలల్లో 42 లైసెన్స్ పొందిన గృహ కార్మికుల నియామక సంస్థలకు 135 చట్టపరమైన, పరిపాలనా ఉల్లంఘనల కారణంగా జరిమానాలు విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మొత్తం ఉల్లంఘనల్లో 106 కేసులు యజమానులకు చెల్లించిన నియామక రుసుమును పూర్తిగా లేదా పాక్షికంగా నిర్ణీత గడువులో తిరిగి చెల్లించకపోవడానికి సంబంధించినవే అని అధికారులు తెలిపారు. గృహ కార్మికుల చట్టం అమలు నిబంధనల ప్రకారం, గృహ కార్మికుడు తిరిగి సంస్థకు చేరినప్పటి నుంచి లేదా ఉద్యోగం వదిలేసినట్లు సమాచారం అందిన తేదీ నుంచి రెండు వారాల్లోపు యజమానికి రుసుము తిరిగి చెల్లించడం తప్పనిసరి.

ఈ నిబంధనలను పాటించడం ద్వారా యజమానుల హక్కులు పరిరక్షించబడటంతో పాటు ఒప్పంద సంబంధాల్లో సమతుల్యత నెలకొని వివాదాలు తగ్గుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అదనంగా 29 ఉల్లంఘనలు గృహ కార్మికుల నియామకానికి సంబంధించిన ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, విధానాలను పాటించని సంస్థలపై నమోదైనట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 138 లైసెన్స్ పొందిన గృహ కార్మికుల నియామక సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్న MoHRE, వీటిలో అధికశాతం సంస్థలు నిబంధనలను పాటిస్తూ నాణ్యమైన సేవలు, పారదర్శకతను కొనసాగిస్తున్నాయని ప్రశంసించింది.

ఉల్లంఘనలపై తన తనిఖీ, పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, నిబంధనలు అతిక్రమించే సంస్థలపై కఠినంగా, పారదర్శకంగా చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అలాగే, నియామక సంస్థల నుంచి ఎలాంటి అక్రమాలు లేదా లోపాలు ఎదురైనా వినియోగదారులు మంత్రిత్వ శాఖ అధికారిక డిజిటల్ వేదికలు లేదా 80084 లేబర్ క్లెయిమ్స్ అండ్ అడ్వైజరీ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.

ఉద్యోగదాతలు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైన లైసెన్స్ పొందిన నియామక సంస్థలతో మాత్రమే వ్యవహరించాలని, ఒప్పందంపై సంతకం చేసే ముందు సంబంధిత నిబంధనలు, విధానాలను పూర్తిగా పరిశీలించాలని MoHRE విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com