ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!

- July 30, 2026 , by Maagulf
ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!

రియాద్: అంతర్జాతీయ సైన్స్ రంగంలో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్ (International Nuclear Science Olympiad–INSO 2026)ను జెడ్డాలో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీల్లో 19 దేశాలకు చెందిన సుమారు 120 మంది విద్యార్థులు, నిపుణులు పాల్గొననున్నారు.

ఈ ఒలింపియాడ్‌ను సౌదీ విద్యాశాఖ,  మవ్హిబా (King Abdulaziz and His Companions Foundation for Giftedness and Creativity), కింగ్ అబ్దుల్లా సిటీ ఫర్ అటామిక్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ (KACARE) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆగస్టు 2 నుంచి 9 వరకు కింగ్ అబ్దుల్‌అజీజ్ యూనివర్సిటీలో ఈ పోటీలు జరగనున్నాయి. ఆగస్టు 3న మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్‌అజీజ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు.

అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) 2024లో గుర్తింపు ఇచ్చిన ఈ ఒలింపియాడ్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు అణు విజ్ఞానంలో తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, శాంతియుత అణు సాంకేతిక వినియోగంపై అవగాహన పెంపొందించుకోవడానికి ఒక అంతర్జాతీయ వేదికగా నిలుస్తోంది. అణు సాంకేతికతలను సురక్షితంగా, శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించే దిశగా యువతను ప్రోత్సహించడం కూడా దీని ప్రధాన లక్ష్యంగా ఉంది.

మవ్హిబా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌అజీజ్ అల్-కురైడిస్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు సౌదీ నాయకత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఫిలిప్పీన్స్‌లో 2024లో జరిగిన తొలి ఎడిషన్, మలేషియాలో 2025లో జరిగిన రెండో ఎడిషన్‌లలో సౌదీ అరేబియా పాల్గొని ఒక రజత పతకం, మూడు కాంస్య పతకాలతో సహా మొత్తం ఐదు అంతర్జాతీయ అవార్డులు సాధించింది.

ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా తన ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com