యూఏఈలో ఆగస్టులో ఇంధన ధరలు తగ్గుతాయా?

- July 30, 2026 , by Maagulf
యూఏఈలో ఆగస్టులో ఇంధన ధరలు తగ్గుతాయా?

దుబాయ్: యూఏఈలో వాహనదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు నెలలో పెట్రోల్ ధరలు వరుసగా రెండో నెల కూడా తగ్గే అవకాశమున్నప్పటికీ, తగ్గుదల మాత్రం స్వల్పంగానే ఉండొచ్చని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర రవాణా అంతరాయాలు, హోర్ముజ్ జలసంధి పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా చమురు మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది.

సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ వాలేచా మాట్లాడుతూ..  ముడి చమురు ధరలు తగ్గిన ప్రభావం యూఏఈలోని రిటైల్ ఇంధన ధరలపై కనిపిస్తుందని, అయితే అది పూర్తిస్థాయిలో లేదా వెంటనే ప్రతిబింబించకపోవచ్చని తెలిపారు. నిల్వలు తక్కువగా ఉండటం, మార్కెట్ పరిస్థితులు వంటి కారణాలతో పెట్రోల్ ధరల తగ్గుదల పరిమితంగానే ఉండే అవకాశం ఉందన్నారు.

జూలైలో బ్రెంట్ క్రూడ్ సగటు ధర బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద ఉంటే.. స్పెషల్ 95 ధర లీటరుకు దిర్హామ్ 3.13, సూపర్ 98 ధర దిర్హామ్ 3.24 వరకు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

గత మూడు నెలల్లో ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా యూఏఈలో ఇంధన ధరలు వరుసగా పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత జూలైలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సూపర్ 98 ధర లీటరుకు దిర్హామ్ 3.40, స్పెషల్ 95 ధర 3.29, ఈ-ప్లస్ ధర 3.21, డీజిల్ ధర 3.60 దిర్హామ్ గా ఉన్నాయి.

అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా సున్నితంగానే ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎలివేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు మధుర్ కక్కర్ మాట్లాడుతూ..  ప్రస్తుతం చమురు మార్కెట్ డిమాండ్-సరఫరా కంటే అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికే ఎక్కువగా లోనవుతోందన్నారు. పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారితే బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సాక్సో బ్యాంక్ విశ్లేషకులు కూడా ఆగస్టులో చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. గల్ఫ్ ప్రాంత పరిస్థితులను బట్టి యూఏఈ ఇంధన ధరలు మారే అవకాశముందని, అందువల్ల ఆగస్టులో స్వల్ప తగ్గుదల కనిపించినా భారీగా ధరలు తగ్గుతాయని ఆశించవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com