అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటివి అదుపులో ఉంచే ఆసనాలివి..

- August 16, 2016 , by Maagulf
అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటివి అదుపులో ఉంచే ఆసనాలివి..

రోజంతా ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల పొట్టదగ్గర కొవ్వు చేరడమే కాదు.. జీర్ణవ్యవస్థ పనితీరుపైనా ప్రభావం పడుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటివి తప్పవు. ఆ సమస్యల్ని అదుపులో ఉంచే ఆసనాలివి..
ధనురాసనం: బోర్లాపడుకుని రెండు కాళ్లూ దగ్గర పెట్టుకోవాలి. రెండు మోకాళ్లు వెనక్కి మడిచి పిరుదలవైపు తీసుకొచ్చి చేతులతో రెండు కాళ్ల మడమలని పట్టుకుని శ్వాస తీసుకుంటూ, తల.. భుజాలూ పైకి తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు మోచేతులు వంచకుండా నిటారుగా ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకూ తొడలనీ మోకాళ్లనీ కూడా పైకి లేపాలి. ఈ స్థితిలో మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ అరనిమిషం వరకూ ఉండాలి. బోర్లాపడుకునే విశ్రాంతి స్థితిలోకి వెళ్లీ.. మళ్లీ అదే విధంగా చేయాలి. అలా మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణశక్తి పెరిగి.. ఉదర సంబంద సమస్యలు తగ్గుతాయి. పొట్ట, పిరుదుల దగ్గర చేరిన కొవ్వు తగ్గుతుంది. హెర్నియా సమస్య ఉన్న వారు ఈ ఆసనం వేయకూడదు.
చక్రాసనం: వెల్లకిలా పడుకోవాలి. రెండు మోకాళ్లూ మడిచి రెండు పాదాలు దగ్గరకు తీసుకోవాలి. రెండు అరచేతులూ రెండు చెవులకు ఇరువైపుల ఉంచాలి. తరవాత మొత్తం శరీరాన్ని చేతులమీద వేసి పైకి లేపాలి. శరీరాన్ని ముందుకు కానీ వెనక్కి గానీ తీసుకురాకూడదు. మోచేతులు నిటారుగా ఉంచాలి. ఇలా వీలైనంత సేపు ఉండి.. తరవాత నెమ్మదిగా పిరుదులని నేలపై ఉంచి విశ్రాంతి స్థితిలోకి రావాలి. అధికరక్తపోటు ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయకూడదు. ఆ ఆసనం వల్ల పొట్ట కండరాలు స్ట్రెచ్‌ అవుతాయి. అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. వెన్నెముక బలంగా తయారవుతుంది.
నమస్కార కోణాసనం: నిలబడి రెండు కాళ్లూ సాధ్యమైనంత దూరంగా.. ఎడమ పాదాన్ని ఎడమవైపు తిప్పి ఉంచాలి. కుడిపాదాన్ని వెనక్కి పెట్టాలి. ఎడమ కాలుని 90 డిగ్రీల్లో వంచాలి. ఇప్పుడు నిదానంగా ముందుకు వంగి కుడిమోచేతి పైభాగాన్ని ఎడమ మోకాలిపై ఉంచాలి. పక్కకి తిరిగి చూస్తున్నట్టుగా ఉండి, నమస్కార ముద్రపెట్టాలి. ఇలా వీలైనంత సేపు ఉండి విశ్రాంత స్థితిలోకి రావాలి. తరవాత కాళ్లు మార్చాలి. ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాదు.. పొట్టదగ్గర కొవ్వూ తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com