కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- August 14, 2026
అబుదాబి: కొలంబియాలో భారీ భూకంపం సృష్టించిన విషాదం నేపథ్యంలో బాధితులకు యూఏఈ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. భూకంప బాధితుల కోసం 10 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని అందించాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏజెన్సీ ద్వారా ఈ సహాయాన్ని కొలంబియాకు పంపిస్తున్నారు. అత్యవసర వైద్య సామగ్రి, ఆహారం, ఆశ్రయ సామగ్రితో పాటు బాధితులకు అవసరమైన ఇతర సహాయాన్ని అందించేందుకు యూఏఈ బృందాలు కొలంబియా అధికారులతో, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాయి.
ప్రకృతి విపత్తులు, మానవతా సంక్షోభాల సమయంలో స్నేహపూర్వక దేశాలకు అండగా నిలవాలన్న యూఏఈ విధానంలో భాగంగానే ఈ అత్యవసర సహాయాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలకు సాయం వేగంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ తారిఖ్ అహ్మద్ అల్ అమెరీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా సహాయాన్ని వేగంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బాధితుల కష్టాలను తగ్గించడంతో పాటు.. ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన సాధారణ పరిస్థితులు నెలకొనేలా సాయం చేయడమే లక్ష్యమన్నారు.
కొలంబియా అధ్యక్షుడికి ఫోన్
భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు యూఏఈ అధ్యక్షుడు సంతాపం తెలిపారు. కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాతో ఫోన్లో మాట్లాడిన షేక్ మహమ్మద్.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కొలంబియాలో సంభవించిన 7.4 తీవ్రతతో కూడిన భూకంపం ఈ శతాబ్దంలో దేశాన్ని తాకిన అత్యంత బలమైన భూకంపంగా అధికారులు పేర్కొన్నారు. ఈ విపత్తులో 265 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,500 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 500 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. భూకంపం కారణంగా 11 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా







