భారతి మాతాజీ అస్తమయం

- October 02, 2026 , by Maagulf
భారతి మాతాజీ అస్తమయం

గూడూరు: కృష్ణాజిల్లా గూడూరుకు చెందిన మహాయోగిని రాజమాత శ్రీశ్రీశ్రీ విశుద్ధానంద భారతి మాతాజీ(72) గురువారం తెల్లవారుజామున పరమపదించారు. షిర్డీసాయి భక్తులు అయిన ఆధ్యాత్మిక గురువు రామ్ రతన్ జీ, భారతి మాతాజీ దంపతులు వృత్తిరీత్యా వైద్యులు అయినా ఆధ్యాత్మికత, సేవా భావంతో సాయితత్వాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు కృషి చేశారు. విశ్వమానవ కల్యాణం.. కులమతాలు లేని సమాజమనే సాయి తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసే క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర దేశాల్లో కూడా పర్యటించిన వీరు 

గూడూరులో వరాల సాయి మందిరం నిర్మించి 17 ఏళ్లకు పైగా ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

గురువు రామ్ రతన్ జీ 2019 మే లో శివైక్యం చెందగా అప్పటి నుంచి మాతాజీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానవాళికి బాధల నుంచి విముక్తి కలిగించాలన్న లక్ష్యంతో అఖండ జ్యోతి పారాయణ మహాయజ్ఞం క్రతువు చేపట్టారు. అలా కొన్నేళ్ల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, దిల్లీ, ముంబయి లాంటి దాదాపు వెయ్యి ప్రాంతాల్లో అఖండ జ్యోతి పూజలు చేసిన తర్వాత 1080వ అఖండ జ్యోతి స్తూపాన్ని గూడూరు వరాల సాయి మందిరంలో నిర్మించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దత్తకారుణ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా  అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గూడూరులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆశ్రమానికి వచ్చి మాతాజీ పార్ధివ దేహాన్ని సందర్శించి పూజలు చేసి, ఆమె కుమారుడు పవన్ కుమార్ ను  పరామర్శించారు. శుక్రవారం కూడా భక్తుల సందర్శనార్థం ఉంచి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భక్త బృంద సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com