అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- October 03, 2026
దుబాయ్: ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఎతిహాద్ రైల్ ఈ వారాంతంలో అబుదాబి-దుబాయ్ మధ్య అదనంగా ఆరు రైలు సర్వీసులను నడపనుంది. అక్టోబర్ 3న మూడు కొత్త రైళ్ల ద్వారా 1,000కు పైగా అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 4న మరో మూడు సర్వీసుల్లో 1,000కు పైగా సీట్లు కేటాయించారు. ప్రయాణికుల నుంచి ముందస్తుగా భారీగా టికెట్లకు డిమాండ్ రావడంతో ఈ అదనపు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ఎతిహాద్ రైల్ తెలిపింది.
అదనపు రైళ్ల టికెట్ల విక్రయం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విక్రయాలు ప్రారంభమైన రెండు గంటల్లోనే శనివారం దుబాయ్-అబుదాబి మధ్య నడిచే పలు రైళ్ల ప్రీమియం క్లాస్ సీట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. అయితే చాలా రైళ్లలో కంఫర్ట్ క్లాస్ టికెట్లు కొంతమేర అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. దుబాయ్‌లోని అల్ యలాయిస్ స్టేషన్ బుధవారం నుంచి సాధారణ ప్రయాణికుల కోసం ప్రారంభమైంది. తొలి రోజే వందలాది మంది ప్రయాణికులు రెండు నగరాల మధ్య రైలు ప్రయాణం చేశారు. వారంలో సాధారణ రోజుల్లో అబుదాబి, దుబాయ్ మధ్య మొత్తం 10 సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో రెండు ఉదయం, మిగిలినవి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నడుస్తాయి.
అబుదాబి నుంచి దుబాయ్‌కు రైలు ప్రయాణం సుమారు 1 గంట 4 నిమిషాలు పడుతుంది. రైళ్లు గంటకు గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. టికెట్లను ఎతిహాద్ రైల్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు స్టేషన్లలో నేరుగా కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు సగటున 10 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నట్లు ఎతిహాద్ రైల్ ప్రతినిధి తెలిపారు.
ప్రయాణికులకు మూడు రకాల టికెట్ ఎంపికలు ఉన్నాయి. సేవర్ టికెట్లో సీటును ఆటోమేటిక్‌గా కేటాయిస్తారు. రీఫండ్ ఉండదు. వాల్యూ క్లాస్‌కు అదనంగా Dh20 చెల్లిస్తే టికెట్లో మార్పులు చేసుకునే అవకాశం, ఉచిత సీటు ఎంపిక ఉంటుంది. ఫ్లెక్స్ టికెట్‌కు అదనంగా Dh50 చెల్లించాలి. ఇందులో టికెట్ మార్పులు, సీటు ఎంపికతో పాటు రీఫండ్ సౌకర్యం ఉంటుంది. 2 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలకు పెద్దల టికెట్ ధరలో 50 శాతం మాత్రమే వసూలు చేస్తారు. సీనియర్ సిటిజన్లకు 20 శాతం రాయితీ అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







