విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

- November 16, 2026 , by Maagulf
విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం

విశాఖపట్నం: కాలుష్యాన్ని తగ్గించి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ సిటీ బస్సు (EV) సర్వీసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. విశాఖపట్నంలో తొలి విడతలో భాగంగా నగరంలోని వివిధ ప్రధాన రూట్లలో 30 ఆధునిక ఈవీ మెట్రో బస్సులను ప్రారంభించారు. గాజువాక ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD) శివప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు.

 ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలు ఈ కొత్త ఎలక్ట్రిక్ మెట్రో బస్సుల్లోనూ పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి వాయు, శబ్ద కాలుష్యం లేకుండా ప్రయాణికులకు అత్యంత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఈ బస్సులు అందిస్తాయని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని ఈవీ బస్సులు: ఆర్టీసీ జేఎండీ
ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్థపై ఇంధన ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ ఆధునిక బస్సుల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరియు అవసరాలకు అనుగుణంగా మరిన్ని అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులను విశాఖ నగరానికి కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com