బహ్రెయిన్ లో ఉగ్రవాద కేసులో జీవిత ఖైదు.. పలువురికి 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- November 17, 2026
మనామా: ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, నిర్వహించిన కేసులో బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన వారితో పాటు పరారీలో ఉన్న నిందితులందరినీ దోషులుగా నిర్ధారించింది. నిందితులకు జీవిత ఖైదు నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించింది. కొంతమంది నిందితులకు BD100,000 జరిమానా కూడా విధించింది. అంతేకాకుండా, స్వాధీనం చేసుకున్న BD8 మిలియన్లకు పైగా నగదును, ఇతర వస్తువులను స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం జప్తు చేయాలని ఆదేశించింది.
బలవంతంగా ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర
టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ అధిపతి, అడ్వకేట్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ వ్యవస్థను బలవంతంగా మార్చడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఉగ్రవాదం, అల్లర్లు, విధ్వంసక చర్యలకు పాల్పడాలని ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బహ్రెయిన్ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో కొంతమంది నిందితులు ఇరాన్, IRGCతో సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇరాన్ పాలక వ్యవస్థకు విధేయత చూపాలని, విలాయత్ అల్-ఫఖీహ్ (Wilayat Al-Faqih) సిద్ధాంతాన్ని ప్రోత్సహించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
మత, సామాజిక సంస్థల ద్వారా ప్రచారం
తమ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రార్థనా స్థలాలు, సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలను ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. వీటి ద్వారా బహ్రెయిన్‌లో అస్థిరత సృష్టించే కార్యకలాపాలను ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఈ కేసులో భద్రతా, ఆర్థిక దర్యాప్తు నివేదికలు, పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కీలక ఆధారాలుగా నిలిచాయి. వివిధ కరెన్సీల్లో సుమారు BD935,000 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డు చేసిన ప్రసంగాలు, సంస్థ నాయకులకు IRGC, ఇరాన్ నిఘా సంస్థలతో ఉన్న సంబంధాలకు సంబంధించిన ఆధారాలు, కొంతమంది నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
నిందితులకు చట్టపరమైన హక్కులు కల్పించాం
దర్యాప్తు, విచారణ సమయంలో నిందితులకు చట్టప్రకారం లభించాల్సిన హక్కులన్నీ కల్పించినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. తమ వాదనలు వినిపించేందుకు పూర్తి అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. నిందితుల తరఫు న్యాయవాదులకు కేసు పత్రాలను పరిశీలించేందుకు, ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రశ్నించేందుకు అనుమతించారు. రక్షణ తరఫు సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు స్వీకరించింది. విచారణ పారదర్శకంగా జరిగేలా నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధి కూడా కోర్టు విచారణకు హాజరై ప్రక్రియను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







