ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!

- November 18, 2026 , by Maagulf
ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!

మనామా: బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ ఇరాన్‌పై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులపై ఇరాన్ విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలను తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే చర్యగా అభివర్ణించింది. ఇరాన్ వ్యాఖ్యలు ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ సూత్రాలకు, పొరుగు దేశాల మధ్య సత్సంబంధాల నిబంధనలకు విరుద్ధమని బహ్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది.

బహ్రెయిన్ న్యాయస్థానాలు స్వతంత్రంగా, చట్టానికి అనుగుణంగా, రాజ్యాంగపరమైన హక్కులు, న్యాయపరమైన రక్షణలను గౌరవిస్తూ తీర్పులు వెలువరించాయని స్పష్టం చేసింది. వ్యక్తులపై వారి మత విశ్వాసాల ఆధారంగా కాకుండా, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినందుకే విచారణ జరిపి శిక్షలు విధించినట్లు తెలిపింది. దేశంలో అన్ని మతాల వారు తమ మతాచారాలను స్వేచ్ఛగా పాటించే హక్కు ఉందని వెల్లడించింది.

ఈ కేసుకు సంబంధించిన న్యాయప్రక్రియ 2016 మేలోనే ప్రారంభమైందని బహ్రెయిన్ గుర్తుచేసింది. బాహ్య ప్రకటనలు లేదా రాజకీయ వైఖరులతో న్యాయపరమైన ప్రక్రియను ముడిపెట్టే ప్రయత్నాలను తిరస్కరించింది. ఇరాన్‌కు గూఢచర్యం చేయడం, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్‌తో సంబంధాలు కలిగి ఉండటం వంటి ఆరోపణలకు సంబంధించిన కేసులో దోషులుగా తేలిన వ్యక్తులకు ఇరాన్ విదేశాంగ శాఖ వెంటనే మద్దతుగా స్పందించడం పలు సందేహాలకు తావిస్తోందని బహ్రెయిన్ పేర్కొంది.

ఇదే సమయంలో బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ కొనసాగిస్తున్న దాడుల నుంచి అంతర్జాతీయ దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నట్లు ఆరోపించింది. ఈ దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించిందని తెలిపింది. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తక్షణమే నిలిపివేయాలని, తమ దేశంపై దాడులను ఆపాలని ఇరాన్‌ను కోరింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 (2026)ను పూర్తిగా పాటించాలని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com