ఎయిర్పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!

- November 18, 2026 , by Maagulf
ఎయిర్పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!

న్యూ ఢిల్లీ: దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతా విధుల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది సంఖ్యను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు నాన్-ఆర్మ్డ్ డ్యూటీలను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ NDTV వెల్లడించింది. సాధారణ తనిఖీలు, ఇతర ఆయుధాలు అవసరం లేని విధులను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో నిర్వహించే అవకాశం ఉంది. అయితే విమానాశ్రయాల భద్రతలో అత్యంత కీలకమైన బాధ్యతలను మాత్రం CISF సిబ్బందే కొనసాగించనున్నారు. ఉగ్రవాద ముప్పులు, అత్యవసర పరిస్థితులు, కీలక భద్రతా వ్యవహారాల పర్యవేక్షణ వంటి ముఖ్యమైన విధుల్లో CISF పాత్ర యథాతథంగా ఉండనుంది.

ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ల విజ్ఞప్తితో మార్పులు..ఖర్చుల తగ్గింపు పై దృష్టి

విమానాశ్రయాల నిర్వహణ వ్యయం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో CISF సిబ్బంది నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించాలని ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ప్రత్యామ్నాయ భద్రతా విధానాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలకు CISF భద్రత కల్పిస్తోంది. అన్ని విధులకూ CISF సిబ్బందిని వినియోగించకుండా, సాధారణ విధులను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చని భావిస్తున్నారు. అయితే ప్రైవేట్ సిబ్బందిని నియమించినప్పటికీ విమానాశ్రయాల భద్రతా ప్రమాణాలు తగ్గకుండా చూడటం కీలకం కానుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతా విధుల నిర్వహణలో కొత్త విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com