ఖతార్‌లో ప్రైవేట్ పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!

- November 18, 2026 , by Maagulf
ఖతార్‌లో ప్రైవేట్ పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!

దోహా: ఖతార్‌లోని ప్రైవేట్ పాఠశాలలు, కిండర్ గార్టెన్లలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, విద్యార్థులకు సురక్షితమైన, స్థిరమైన విద్యా వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ తొలిసారిగా కొత్త నియంత్రణ మార్గదర్శకాలను విడుదల చేసింది. మంత్రిత్వ శాఖకు చెందిన ప్రైవేట్ విద్యా వ్యవహారాల విభాగం రూపొందించిన ఈ మార్గదర్శకాలు పాఠశాలల నిర్వహణ, పాలనా విధానాలు, సంస్థాగత పనితీరును మెరుగుపరచడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది హక్కులను పరిరక్షించనున్నాయి.

ఈ మార్గదర్శకాల్లో పాఠశాలల నిర్వహణ, సిబ్బంది నియామకాలు, ట్యూషన్ ఫీజులు, ఆర్థిక వ్యవహారాలు, విద్యార్థుల అడ్మిషన్లు, బోధన, అభ్యసన విధానాలు, ఆరోగ్యం, భద్రత, విద్యార్థుల ప్రవర్తన, పరీక్షలు, మూల్యాంకనానికి సంబంధించిన నిబంధనలను వివరించారు. గత కొన్నేళ్లుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో నమోదైన ఉల్లంఘనలు, సమస్యలను విశ్లేషించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తరచూ జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడం, అన్ని విద్యా సంస్థల్లో ఒకే విధమైన విధానాలను అమలు చేయడం దీని ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

ప్రైవేట్ విద్యారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, మెరుగైన పాలనా విధానాలను బలోపేతం చేయడంలో ఈ మార్గదర్శకాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రైవేట్ పాఠశాలలు, కిండర్ గార్టెన్ల విభాగం డైరెక్టర్, ప్రైవేట్ లైసెన్సింగ్ విభాగం తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ రానియా యూస్రి మొహమ్మద్ తెలిపారు. విద్యా సంస్థలు పాటించాల్సిన బాధ్యతలు, నిబంధనలపై స్పష్టత వస్తుందని, వాటి అమలులో ఉన్న భిన్నాభిప్రాయాలు, విధానపరమైన తేడాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఖతార్‌లో మొత్తం 354 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 240 పాఠశాలలు ఎలాంటి ఉల్లంఘనలు నమోదు కాకుండా 'మై వైట్ ఫ్లాగ్ అవార్డు' గుర్తింపు పొందాయని తెలిపారు. ఇది ప్రైవేట్ విద్యారంగంలో అనేక సంస్థలు నిబంధనలను పాటిస్తున్నాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అయితే విద్యా ప్రమాణాలను కాపాడటంతో పాటు పాఠశాలల్లో కొత్త బోధనా పద్ధతులు, ఆధునిక అభ్యసన సాధనాలకు కూడా అవకాశం కల్పించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com