స్పైస్‌జెట్ కు ఆర్థిక కష్టాలు.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సహకారం..!!

- November 18, 2026 , by Maagulf
స్పైస్‌జెట్ కు ఆర్థిక కష్టాలు.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సహకారం..!!
దుబాయ్: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భారత విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) సమస్యలను పరిష్కరించేందుకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సహకరిస్తోందని సంస్థ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ వెల్లడించారు. స్పైస్‌జెట్ తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకుని, స్థిరమైన కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన అంగీకరించారు. అయితే దుబాయ్ విమానాశ్రయానికి ఆ సంస్థ ముఖ్యమైన కస్టమర్ అని, దాని కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు రీఫైనాన్సింగ్ అవకాశాలను పరిశీలించడంలో సహకరిస్తున్నట్లు వివరించారు.
 
Dh14 మిలియన్లకు పైగా బకాయిలు
 
మీడియా కథనాల ప్రకారం.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (DXB) Dh14 మిలియన్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్ విమానాలకు సంబంధించిన చెక్-ఇన్ సేవలను నిలిపివేశారు. ఈ పరిణామంతో దుబాయ్ నుంచి భారత్‌కు వెళ్లే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో నవంబర్ 17న దుబాయ్ నుంచి అమృత్‌సర్, ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానాలు రద్దయినట్లు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సమాచారం వెల్లడించింది.
 
త్వరలో సాధారణ స్థితికి సేవలు.. స్పైస్‌జెట్
 
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు బోయింగ్ 737 NG, బాంబార్డియర్ Q400 విమానాల వినియోగాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు స్పైస్‌జెట్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో అదనపు విమానాలు, కొత్త విమానాల సమీకరణ ద్వారా కార్యకలాపాలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే విమాన సేవలు సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
 
భారత ప్రయాణికులకు కీలకం 
 
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత్ అతిపెద్ద అంతర్జాతీయ ప్రయాణికుల మార్కెట్‌గా కొనసాగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో భారత్ నుంచి 2.6 మిలియన్ల మంది ప్రయాణికులు DXB విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. సౌదీ అరేబియా 1.4 మిలియన్ల ప్రయాణికులతో తర్వాతి స్థానంలో ఉంది. ముంబై, న్యూఢిల్లీ అత్యంత రద్దీగా ఉండే నగరాల జాబితాలో ఉన్నాయి. 2026 తొలి తొమ్మిది నెలల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 50.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఏడాది మొత్తం మీద సుమారు 71 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
డిసెంబర్ 7లోగా ఆర్థిక నివేదికలు
 
మరోవైపు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ఫలితాలను డిసెంబర్ 7లోగా ప్రకటిస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. ఆర్థిక నివేదికలు సమర్పించకపోతే షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేస్తామని దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఒకటైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. మార్చి, జూన్ త్రైమాసికాలకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను సమర్పించనందున డిసెంబర్ 10 నుంచి స్పైస్‌జెట్ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేస్తామని BSE నోటీసు జారీ చేసింది. అయితే డిసెంబర్ 7లోగా నిబంధనల ప్రకారం నివేదికలు సమర్పిస్తే ఈ చర్య అమలులోకి రాదని స్పష్టం చేసింది.
 
దుబాయ్ నుంచి భారత్‌కు ప్రయాణించే వేలాది మంది భారతీయులపై ఈ పరిణామాల ప్రభావం పడే అవకాశం ఉండటంతో స్పైస్‌జెట్ కార్యకలాపాలు ఎప్పుడు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com