ఆధార్‌ విధానం పట్ల విదేశాలు ఆసక్తి..

- September 11, 2016 , by Maagulf
ఆధార్‌ విధానం పట్ల విదేశాలు ఆసక్తి..

వేలిముద్రలు, కనుపాపలు ఆధారంగా మన దేశంలో దాదాపు 125 కోట్ల మందికి గుర్తింపునిచ్చేందుకు అమలు చేస్తున్న ఆధార్‌ విధానం పట్ల విదేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సంప్రదాయ పద్ధతిలో గుర్తింపును ఇస్తూ వస్తున్న కొన్ని దేశాలు ఇలాంటి విధానాన్ని తమ వద్దా అమలు పరిచేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఆధార్‌ను ఎలా అమలు పరుస్తున్నారో తెలుసుకునేందుకు 'భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ' (ఉడాయ్‌) కార్యాలయానికి ప్రతినిధి బృందాలుగా వస్తున్నాయి. కీలకమైన సమాచారాన్ని బయటివారితో పంచుకోరాదని ఆధార్‌ చట్టంలో స్పష్టంగా ఉండడంతో దాని జోలికి పోకుండా, గుర్తింపు సంఖ్యల కేటాయింపు విధానం గురించి అధికార వర్గాలు ఆ బృందాలకు స్థూలంగా వివరించి చెబుతున్నాయి.

ఆఫ్రికా దేశాలు ఆధార్‌ పట్ల అత్యంత ఆసక్తితో ఉండడంతో ప్రపంచ బ్యాంకు లాంఛనంగా విదేశీబృందాలను పంపిస్తోంది. ఉడాయ్‌ నమూనాను పరిశీలించడానికి నైజీరియా నుంచి ఒక బృందం ఇప్పటికే వచ్చి వెళ్లింది. టాంజానియా బృందం ఈ నెలాఖరులోగా రానుంది. మరికొన్ని ఆసియా దేశాలు కూడా ఉడాయ్‌ మార్గదర్శకత్వాన్ని కోరాయి.

బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి అధికార ప్రతినిధులు దిల్లీలోని ఉడాయ్‌ కార్యాలయాన్ని సందర్శించి, వివరాలు కోరారు. ఇప్పటికే 104 కోట్ల మంది భారతీయుల వివరాలతో సమాచారాన్ని నిర్వహిస్తున్న తీరును, గుర్తింపు వివరాలను ఉపయోగించుకుంటున్న పద్ధతిని విదేశాలు అడిగి తెలుసుకున్నాయి. ఇలాంటి విధానాన్నే తమతమ దేశాల్లోనూ అమలు పరిచేందుకు అత్యంత ఆసక్తి చూపించాయి. చాలా దేశాల్లో పౌరుల గుర్తింపునకు దోషరహిత వ్యవస్థలేదు.

కొన్ని దేశాల్లో వివరాలైతే ఉన్నా అవన్నీ కాగితం రూపంలో దస్త్రాల్లో ఉంటున్నాయి. భారత్‌లో మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద దోషరహిత బయోమెట్రిక్‌ గుర్తింపు సమాచార వ్యవస్థ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com