తెలంగాణను పునాదులతో సహా పటిష్టంగా పునర్నిర్మిస్తాం : కేటీఆర్
- September 14, 2016
రాష్ట్రంలో నీటి లభ్యత, వినియోగంపై సామాన్యులకు అర్థమయ్యే భాషలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో వివరించినా.. కొందరికి మాత్రం అర్థంకాక రాష్ట్రపతి, గవర్నర్ చుట్టూ తిరుగుతున్నారంటూ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కాంగ్రెస్ నాయకులను ఎద్దేవా చేశారు.నీటిపారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌పై సీఎం.. టెక్నాలజీ సాయంతో వివరించారని, అయినా తను కంప్యూటర్ ఇంజనీర్‌నని, ఐటీ విప్లవాన్ని తెచ్చానని ఏనాడూ చెప్పుకోలేదన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 156వ జయంతి సందర్భంగా బుధవారమిక్కడ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (తెలంగాణ స్టేట్ సెంటర్), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన 49వ ఇంజనీర్స్ డేలో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణను పునాదులతో సహా పటిష్టంగా పునర్నిర్మించి, జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ పథకం వేల సంవత్సరాల నాటి సాంకేతిక అద్భుతానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 425 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్ నేటికీ చెక్కుచెదరలేదు కానీ.. ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతున్నాయన్నారు. ''సాగునీరు సంపదకు మూలం. సంపద నుంచి సంస్కృతి, విద్య, వాణిజ్యం పుట్టుకొస్తాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు చెరువులను సద్వినియోగం చేసుకుని తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా మారితే రైతులు శాశ్వతంగా బాగు పడతారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల నిర్మాణంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు సహజమే. రిజర్వాయర్లపై వస్తున్న ఆరోపణలకు ఇంజనీర్లు బాధ్యత తీసుకుని సమాధానాలు ఇవ్వాలి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ల నియామకం జరిగినా.. పని ఒత్తిడి ఉంది. ఇంజనీర్ల ఆత్మగౌరవం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈపీసీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలకు డిజైన్ బాధ్యత అప్పగించింది'' అని కేటీఆర్ అన్నారు.
నగరాన్ని బాగు చేస్తా..
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ అన్నారు. అయితే ప్రణాళికబద్ధంగా మార్చేందుకు కొంత సమయం ఇవ్వాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ''హైదరాబాద్ లో రోడ్లు బాగా లేవనే అంశాన్ని దాచినా దాగదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత హైదరాబాద్‌లో వరద నీటి నిర్వహణ, మురుగు కాల్వల వ్యవస్థను మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రయత్నం జరగలేదు. ఈ వ్యవస్థలను బాగు చేయడాన్ని సవాలుగా తీసుకుంటా'' అని కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు రూ.11 వేల కోట్లు అవసరమని, భూగర్భ కేబుల్ వైర్లు, వాటర్, గ్యాస్ పైపులైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదిరాలతోపాటు రోడ్ల వైట్ ట్యాపిం గ్‌కు కిలోమీటరుకు రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు.హైదరాబాద్‌లో 9 వేల కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నందున నిధుల సమీకరణపై దృష్టి సారించామని వివరించారు. హైదరాబాద్ ప్రధాన నగరంలో వారసత్వంగా వచ్చిన సమస్యలను అధిగమిస్తూనే.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఐదు మాస్టర్‌ప్లాన్‌లను సమ్మిళితం చేసి ఏకీకృత మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను పెంచడంతో పాటు జర్మనీ తరహాలో చదువుకుంటూనే పనిచేసే విధానాన్ని తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ అధ్యక్షుడు జె.సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ బాల్క సుమన్, మాజీ అధ్యక్షుడు జి.ప్రభాకర్, కార్యదర్శి రామేశ్వర్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండీ దానకిషోర్, డాక్టర్ పి.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పరిశోధన, విద్యలో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులు అందజేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







