స్వదేశీ టపాసులు కాల్చమని ప్రధాని మోడీ పిలుపు

- September 29, 2016 , by Maagulf
స్వదేశీ టపాసులు కాల్చమని ప్రధాని మోడీ పిలుపు

దసరా ..దీపావళి ఎంతో దూరంలో లేవు. ఈ పండగలకు క్రేకర్స్‌కు భలే గిరాకీ. దీన్ని మన పొరుగు దేశం చైనా చాలా ఏళ్లుగా క్యాష్‌ చేసుకుంటోంది. దాంతో మన దేశ ఆదాయానికి మనమే గండికొడుతున్నాం. అందుకే స్వదేశీ పటాకులనే కాల్చాలని ప్రధాని నరేంద్రమోడీ  దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందు దసరా దమాకా ..తరువాత  దీపావళి మెరుపులు. వాటితోపాటే టపాసుల మోతలు. మార్కెట్లో అప్పుడే వాటి  సందడి మొదలైంది. టపాసులు పేల్చటమంటే డబ్బును తగలబెట్టటమే అంటారు చాలా మంది. కాని కోట్లాది మంది ఆనందానికి చిహ్నం ఆ టపాసుల మోతే!. ఎవరేమన్నా పండుగల వేళ టపాసుల మోత ఆగదు. ఐతే, అవేవో స్వదేశీ టపాసులైతే మంచిది. వాటిపైన చేసిన ఖర్చు కనీసం మనదేశంలోనే ఉంటుంది. కాని కొన్నేళ్లుగా చైనా నుంచి దిగుమతవుతున్న టపాసుల దెబ్బకు మనవి తుస్సుమంటున్నాయి. అందుకే వాటిని వాడవద్దని ..స్వదేశీవే కాల్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రజలకు పిలుపునిచ్చారు.ఏటా దీపావళి వేళ  ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్న విదేశీ బాణాసంచా దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఏటా భారత్‌కు విదేశీ బాణాసంచా దిగుమతి అవుతున్నాయి. ప్రమాదకర రసాయనం పొటాషియం క్లోరేట్‌తో తయారైన పేలుడు పదార్థాలు స్వేచ్ఛగా దిగుమతి అవుతున్నట్లు దేశీయ బాణాసంచా వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సల్ఫర్‌, సల్ఫ్యూరేట్‌లను ఏదైనా క్లోరేట్‌ మిశ్రమంలో కలిపి తయారు చేసే విస్ఫోటనాల వినియోగంపై కూడా భారత్‌లో నిషేధం ఉంది. 2008 చట్టప్రకారం ఇప్పటి వరకూ బాణాసంచా దిగుమతులకు ఎలాంటి అనుమతులు లేవు.  స్వదేశీ టపాసులతో పోలిస్తే చైనా నుంచి దిగుమతయ్యేవాటి ఖరీదు చాలా తక్కువ. అతి తక్కువ ధరకే మన మార్కెట్ లోకి వదులుతుండటటంతో స్వదేశీ క్రేకర్స్‌ తయారీదారులు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. తక్కువ ధరకే దొరికే వస్తువులను విరగబడి కొనే మన సగటు జనం ముప్పాతిక శాతం చైనా టపాసులను కొనడానికి ఆసక్తి చుపిస్తున్నారు. ఒక్క దీపావళికే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను చైనా కొల్లగొడుతోంది. అందుకే ప్రధాని మోడీ ప్రజలకు అలా విజ్ఞప్తి చేశారు. తన పిలుపుకు ప్రజలు స్పందించాలని కోరారు!! - 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com