ప్రేమమ్‌: రివ్యూ

- October 07, 2016 , by Maagulf
ప్రేమమ్‌: రివ్యూ

చిత్రంపేరు: ప్రేమమ్‌ 
నటీనటులు: నాగచైతన్య.. శ్రుతిహాసన్‌.. అనుపమ పరమేశ్వరన్‌.. మడోనా సెబాస్టియన్‌.. చైతన్యకృష్ణ.. ప్రవీణ్‌.. శ్రీనివాస్‌రెడ్డి.. బ్రహ్మాజీ.. నర్రా శ్రీనివాస్‌.. జీవా.. నాగార్జున - వెంకటేష్‌ (అతిథి పాత్రల్లో).. వైవాహర్ష తదితరులు 
కథ: ఆల్ఫోన్స్‌ పుథరెన్‌ 
సంగీతం: గోపీసుందర్‌, రాజేశ్‌ మురుగేశన్‌ 
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని 
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు 
నిర్మాణం: ఎస్‌.రాధాకృష్ణ, పి.డి.వి.ప్రసాద్‌, ఎస్‌, నాగవంశీ 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.


సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల: 7-10-2016
విజయవంతమైన సినిమాని రీమేక్‌ చేస్తున్నప్పుడు చాలా భయాలు వెంటాడుతుంటాయి. మాతృకలోని మేజిక్‌ మన తెరపైకి అలానే తర్జుమా అవుతుందా లేదా? అనే సందేహం దర్శకుల్లో కనిపిస్తుంటుంది. ఇక క్లాసిక్‌ స్థాయి సినిమాని రీమేక్‌ చేస్తున్నప్పుడు ఆ భయాలు రెట్టింపు అవుతుంటాయి. ఆ ఒత్తిడితో తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి అనుభవాలు మన తెలుగు పరిశ్రమకి చాలానే. అందుకే మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌' రీమేక్‌ అనగానే చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్శకుడు చందు మొండేటి మాతృకని పట్టించుకోకుండా.. దాని తాలూకు విజయం గురించి భయపడకుండా కేవలం అక్కడి ఆత్మని మాత్రమే తీసుకొని స్వేచ్ఛగా రీమేక్‌ చేశారు. నాగచైతన్య కూడా తన కోసమే పుట్టిందీ కథ అన్నట్టుగా 'ప్రేమమ్‌'లో ఒదిగిపోయాడు. అసలు 'ప్రేమమ్‌' కథేమిటి?.. అదెలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: ఇంజినీరింగ్‌ కుర్రాడు విక్రమ్‌ అలియాస్‌ విక్కీ (నాగచైతన్య). అతని టీనేజ్‌ నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదట సుమ (అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకొంటాడు. ప్రేమలేఖ కూడా రాస్తాడు. సుమ మాత్రం తాను మరో అబ్బాయిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోబోతున్నానని చెబుతుంది. మళ్లీ 2005లో ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు లెక్చరర్‌ సితార (శ్రుతిహాసన్‌)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఆమె కూడా విక్కీని ఇష్టపడుతుంది.ఇక ఆమెతోనే తన జీవితం అనుకున్న విక్కీకి అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఆ తర్వాత వృత్తిలో స్థిరపడ్డాక విక్కీని సింధు (మడోనా సెబాస్టియన్‌) వచ్చి పరిచయం చేసుకొంటుంది. ఆమెతో విక్కీకి ఉన్న సంబంధం ఏంటి? తన జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకొన్న విక్కీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.ఎలా ఉందంటే?: ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే కథ ఇది. విక్రమ్‌ అనే ఓ యువకుడి జీవితంలోని పలు దశల్ని ప్రేమ ఎలా ప్రేరేపించింది? ఆ అనుభవాల నుంచి విక్కీ ఏం నేర్చుకొన్నాడు? అనే విషయాలతో చిత్రం సాగుతుంది. తెరపై విక్కీ ప్రేమకథే కాదు.. ప్రతి ఒక్కరి ప్రేమకథ కనిపిస్తుంది. ప్రేమలో గెలవడం.. ఓడిపోవడం కంటే అందులో పడడమే కీలకమైన విషయం అని.. ప్రేమలో గెలిస్తే అమ్మాయి మన పక్కన ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది.
తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. బాల్యాన్ని.. తుంటరి పనుల్ని.. ప్రేమలేఖల రోజుల్ని గుర్తుకు తెప్పిస్తూ విక్రమ్‌- సుమల ఎపిసోడ్‌ సాగుతుంది. ఆ తర్వాత విక్కీ - సితారల మధ్య సన్నివేశాలు అప్పుడప్పుడే సెల్‌ఫోన్‌ పరిచయమైన రోజుల్ని గుర్తుకు తెస్తూ సాగుతాయి. కళాశాలల్లోని గొడవలు.. స్నేహితులతో సరదాల్ని కళ్లముందు మెదిలేలా చేస్తాయి.విక్కీ- సింధుల కథ నేటి వాతావరణాన్ని కళ్ల కడుతుంది. దర్శకుడు చందు మొండేటి కథని అడాప్ట్‌ చేసుకోవడం.. దాన్ని తన శైలిలో రాసుకొన్న విధానం ఆకట్టుకునేలా ఉంది. మాతృక నుంచి పూర్తిగా బయటికొచ్చి సినిమా చేశారు. అందుకే తెరపై మనదైన వాతావరణం.. మనవైన జీవితాలు కనిపిస్తాయి. వెంకటేష్‌.. నాగార్జునల్ని అతిథి పాత్రల్లో చూపించిన వైనం అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.సినిమా ఫక్తు ప్రేమకథే అయినా అభిమానులు ఆశించే మాస్‌ ఎలిమెంట్స్‌కి కూడా కొదవ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు. దీంతో అటు సాధారణ ప్రేక్షకులు.. ఇటు అభిమానులు అందరూ ఆస్వాదించేలా సినిమా రూపుదిద్దుకొంది. ప్రేమకథలకి ఫీల్‌ చాలా ముఖ్యం. ఈ సినిమాలో చిన్నపాటి తడబాటు కనిపిస్తుంది. బ్రేకప్‌ అయినప్పుడు వచ్చే సన్నివేశాలు కానీ మరింత శ్రద్ధ తీసుకొని ఉంటే వేలెత్తి చూపించే అవకాశమే ఉండేది కాదన్న అభిప్రాయం కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే?: నాగచైతన్య మొత్తం తానై నటించి నడిపించారు. మూడు ప్రేమకథల్లోనూ చాలా బాగా ఒదిగిపోయాడు. నటుడిగా ఎంతగా రాటుదేలాడో.. సరైన పాత్ర పడితే నాగచైతన్య ఎలా నటించగలడన్నది ఈ సినిమా నిరూపిస్తుంది. మిగిలిన ఇద్దరు కథానాయికలతో పోలిస్తే శ్రుతిహాసన్‌ తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. సితారగా ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్‌ పక్కింటి అమ్మాయిని గుర్తుకు తెస్తుంది. మడోనా సెబాస్టియన్‌ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది.బ్రహ్మాజీ.. నర్రా శ్రీనివాస్‌.. చైతన్యకృష్ణ.. ప్రవీణ్‌.. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కామెడీ బాగా పండించారు. కథానాయకుడు వెంకటేష్‌ డీసీపీ రామచంద్ర పాత్రలో తళుక్కున మెరిసి అలరించారు. ఆయన పాత్ర ప్రభావం సినిమాపై చివరివరకూ ఉంటుంది. నాగార్జున వాయిస్‌ ఓవర్‌ కూడా సినిమాకి చాలా బాగా ఉపయోగపడింది. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రహణం.. గోపీసుందర్‌.. రాజేశ్‌ మురుగేశన్‌ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. చందు మొండేటిలో ఎంత చక్కటి దర్శకుడు ఉన్నాడో.. అంత మంచి రచయిత కూడా ఉన్నాడన్న విషయాన్ని ఈ సినిమా చెప్పేస్తుంది. చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలాయి.
బలాలు 
+ కథ.. కథనం 
+ మాటలు 
+ నాగచైతన్య 
+ సాంకేతికత
బలహీనతలు 
- అక్కడక్కడా మిస్‌ అయ్యే ఫీల్‌
చివరగా.. 'ప్రేమమ్‌'.. మనల్ని మనకు గుర్తు చేస్తుంది. 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడికి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

మాగల్ఫ్ రేటింగ్#3.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com