సినిమాగా 'కేసీయార్' జీవితం:

- October 20, 2016 , by Maagulf
సినిమాగా 'కేసీయార్' జీవితం:

కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. 
కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు.
కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు.
కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కొందరు కేవలం విధ్వంసకుడన్నారు.
కాని 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆశయ సారధి...
ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం.
కేసీయార్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి చిరునామాగా ఎప్పుడైతే మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధొరణిలో చూడటం మొదలు పెట్టింది...
1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈ నాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎంటీయార్, చంద్రబాబు నాయుడు, వై ఎస్ ఆర్, సోనియా గాంధి, చిరంజీవి, లగడపాటి రాజ్ గోపాల్, వెంకయ్యనాయుడు, అద్వాని ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు విని ఒళ్ళు గగుర్పొడిచింది. 
మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి ఎక్కించాల్సిందేనని నిర్ణయం తీసుకున్నాను. 
2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావదినోత్సవాన షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీయార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 


- మధుర శ్రీధర్"

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com