భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్త త
- November 03, 2016
వాస్తవాధీన రేఖ ప్రాంతంలోని డెమ్‌చోక్ వద్ద గత 36 గంటల నుంచి భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన చైనా సైనికుల్ని భారత జవాన్లు అంగుళం కూడా ముందుకు రాకుండా నిరోధించగలిగారు.
లేహ్‌కు తూర్పున 250 కి.మీ.దూరంలోని డెమ్‌చోక్ వద్ద భారత సైనిక ఇంజినీర్లు ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడానికి ప్రయత్నించగా, చైనా సైన్యం (ప్రజా విముక్తి సైన్యం-పీఎల్‌ఏ) అడ్డుకుంది. బుధవారం అక్కడి వేడి నీటి బుగ్గ (హాట్ స్ప్రింగ్) నుంచి గ్రామం వరకు సాగునీటి కాలువ తవ్వడానికి భారత సైనిక ఇంజినీర్లు ప్రయత్నించగా, చైనా సైనికులు అడ్డుకున్నారు. దీంతో ఉదయం 10.55 గంటల నుంచి రాత్రివరకు ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.గురువారం ఉదయం కూడా భారత ఇంజినీర్లు పైపులైన్లు వేయడానికి ప్రయత్నిస్తుండగా చైనా దళాలు మళ్లీ వచ్చి అడ్డగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 55 మంది చైనా సైనికులు దూకుడుగా వచ్చి పనులను అడ్డగించడంతో అది గమనించిన ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) వచ్చి వారిని అడ్డుకున్నారు. ఇలాంటి పనులు చేపట్టే ముందు పరస్పరం అనుమతులు తీసుకోవాలని, దానిని పాటించనందున పనులు నిలిపివేయాలని డిమాండు చేశాయి. దీనిని భారత సైనికులు తోసిపుచ్చారు.భద్రత వ్యవహారాలకు సంబంధించిన నిర్మాణ పనులు జరిగినప్పుడు మాత్రమే సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. రెండు సైన్యాలూ అక్కడ ఆయుధాలు ధరించి ఎదురెదురుగా మోహరించాయి. చైనా దళాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలకుండా భారత సైన్యం, ఐటీబీపీలు నిలువరించాయని అధికారవర్గాలు తెలిపాయి.
విజయవంతంగా దిగిన సి-17
భారత వాయుసేన మరో కీలక ముందడుగు వేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుల్లో ఉన్న మేచుకా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్‌జీ) వద్ద భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్‌మాస్టర్‌ను తొలిసారిగా గురువారం విజయవంతంగా కిందకు దించింది. ఏఎల్‌జీలు అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లోని సరిహద్దుల రక్షణలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయి. సైన్యాన్ని నిర్దేశిత ప్రాంతానికి వేగవంతంగా చేరవేయడంలో లేదా మారుమూల ప్రాంతాల్లో అప్పటికే సిద్ధంగా ఉన్న సైన్యానికి నిత్యావసరాలు సరఫరా చేయడంలో ఏఎల్‌జీల పాత్ర కీలకం.
చైనా సరిహద్దుకు మేచుకా ఏఎల్‌జీ కేవలం 29 కి.మీ.దూరంలో ఉంది. మేచుకా పట్టణం 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా కీలక వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. భారత్, చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న మెక్‌మొహన్ రేఖ... ఈ పట్టణానికి దాదాపు 40 కి.మీ.దూరంలోనే ఉంది. ఇక్కడికి దగ్గర్లోని రైల్వేస్టేషన్, విమానాశ్రయమంటే అసోంలోని దిబ్రూఘర్ మాత్రమే. ఇది దాదాపు 500 కి.మీ.దూరం ఉంటుంది. ఇక్కడికి రెండు రోజుల ప్రయాణం.
మేచుకా ఏఎల్‌జీ సముద్రమట్టానికి 6,200 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడి రన్‌వే కేవలం 4,200 అడుగుల పొడవు ఉంది. ఇంత ఎత్తైన ప్రదేశంలో చిన్న రన్‌వేపై భారీ విమానాన్ని దించడం ద్వారా భారత వాయుసేన తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నట్లైంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







