బెజవాడలో బోలో జై గణేష్‌!

- September 02, 2015 , by Maagulf
బెజవాడలో బోలో జై గణేష్‌!

తాత్కాలిక రాజధాని విజయవాడలో ఖైరతాబాద్‌కు దీటుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలోని వివిధ రంగాలకు చెందిన యువకులు, అనుభవజ్ఞులు, నిపుణులు భావించి, తదనుగుణంగా కదలడంతో ఇక్కడి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఇది సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటోంది. స్థానిక యువకుడి పారేపల్లి రాకేష్‌ మదిలో మొగ్గ తొడిగిన ఆలోచనను ఆయన మిత్రులతోపాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సంప్రదించగా తమవంతు చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ‘డూండీ (పరమేశ్వరుడికి మరో నామధేయం) గణేష సేవాసమితి’ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో భారీ విగ్రహం తయారీకి శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్‌ విగ్రహాలను సైతం ఏళ్లుగా రూపొందిస్తున్న చెన్నైకు చెందిన రూపశిల్పులే దీనిని తీర్చిదిద్దుతున్నారు. కేవలం బంకమట్టి, ప్రకృతిసిద్ధ రంగులతోనూ చేయించడం ద్వారా ‘ఎకో ఫ్రెండ్లీ’గా రూపొందిస్తున్నారు. శివలింగం నేపథ్యంలో నర్తించే భంగిమలో ఉన్న పార్వతీపుత్రుడి విగ్రహానికి అనుబంధంగా గోమాత, మృగరాజులతోపాటు ప్రధాన ప్రతిమలకు ఇరువైపులా ఒక్కొక్కవైపు నలుగురు చొప్పున అష్టలక్ష్ములను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 30 మంది విగ్రహ తయారీలో నిమగ్నులై ఉండగా, వినాయకచవితి సమీపిస్తుండడంతో పనుల్లో వేగం పెంచేందుకు గురువారం నుంచి మరొక 30 మందిని నియోగించనున్నారు. ప్రస్తుతం ఇనుప మెష్‌లతో విగ్రహం స్వరూపాన్ని పూర్తి చేశారు. మలి దశలో దీనిని బంకమట్టితో నింపి, పైన పీవోపీని పామి, అనంతరం ప్రకృతిరంగులు వేయడంతో భారీ వినాయకుడు భక్తులకు నేత్రపర్వం కావించేలా సిద్ధమవుతాడు. నిమజ్జనోత్సవం ఉండదు..! విగ్రహం తయారీ కోసం అమర్చే ఇనుప మెష్‌ల మధ్య అన్ని ప్రాంతాలకూ చేరగలిగేలా వాటర్‌పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నారు. నిలువెల్లా రంధ్రాలు ఉండే పైపులైన్లలోకి ఉత్సవాల పరిసమాప్తి రోజున మోటార్ల సహాయంతో నీటిని పంపుతారు. ఈ జలం క్రమక్రమంగా విగ్రహం తయారీలో ఉపయోగించిన బంకమట్టిని తడుపుతూ కొన్ని గంటల్లో విగ్రహం కరిగి జారిపోయేలా చేస్తుంది.పూజలకు తొమ్మిది అడుగుల విగ్రహం వినాయకచవితి ఉత్సవాల్లో స్వామివారి చేతిలో తాపేశ్వరం వారితోనే 6,300 కిలోల లడ్డూను తయారు చేయిస్తున్నారు. 63 అడుగుల ఎత్తయిన గజాననుడికి నిత్యపూజలు నిర్వహించడం కష్టసాధ్యమైనందున ప్రత్యేకంగా ఒక 9 అడుగుల ఉత్సవ విగ్రహాన్ని రూపొందింపజేసి, దానికి పూజాదికాలు జరిపించనున్నారు. చవితి ఉత్సవాల ఆఖరి రోజున నిర్వహించే నవాభిషేకాలను భారీ వినాయక ప్రతిమకు పైభాగాన ఏర్పాటు చేసే జల్లెడలోంచి అభిషేక ద్రవ్యాలు స్వామివారిపై పడే లా చూడనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com