తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

- January 05, 2017 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది... ప్రాజెక్టుల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ 123 జీఓ ద్వారా భూసేకరణ చేయరాదని స్పష్టం చేసింది...తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఎమ్మార్వోల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. .. హైకోర్టు వెలువరించిన 78 పేజీల సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు.. తెలంగాణ సర్కారును పునరాలోచనలో పడేలా చేశాయి... తాజా పరిమాణంతో ప్రాజెక్టుల నిర్మాణంలో మరింత జాప్యం జరిగే  పరిస్థితి కనిపిస్తోంది.

ప్రాజెక్టులకు  భూసేకరణ విషయంలో నిర్వాసితులకు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.. దీనికి సంబంధించి 123 జీఓపై మెదక్‌ జిల్లాకు చెందిన రుక్కమ్మ అనే నిర్వాసితురాలు వేసిన పిటిషన్‌పై.. జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి బెంచ్‌ స్టే విధించింది... దాంతో సర్కార్‌ అప్పీలుకు వెళ్లింది...  రమేష్‌రంగనాథన్‌, దుర్గాప్రసాద్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ అప్పీలును విచారించింది. మూడు జిల్లాల నుంచి దాఖలైన మొత్తం 16 పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిపింది. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఎమ్మార్వోల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని పిటిషనర్లు సవాల్‌ చేశారు... దీనిపై పిటిషనర్ల వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం లేదని, స్వచ్ఛంధంగా ముందుకొచ్చిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లించిన తర్వాతనే భూసేకరణ చేస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.

భూములపై ఆధార పడి జీవనం సాగిస్తున్న వివిధ కులవృత్తులు, రైతు కూలీలకు జీఓ నెంబర్‌ 190, 191 జారీ చేసి ప్రభుత్వం  ఆదుకుంటుందని నివేదించారు .. అయితే  ఆర్టికల్ 298 ప్రకారం జీఓ ద్వారా భూసేకరణ చేయడం సరికాదని నిర్వాసితుల తరపు న్యాయవాదులు వాదించారు.... ఇప్పటికే 3 వేల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని అడ్వకేటు జనరల్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు... రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశాలపై తుది వాదనలు వినిపించవచ్చని సూచించింది.

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే 2013 భూసేకరణ చట్టానికి ప్రత్యామ్నాయంగా.. 2016 భూ సేకరణ చట్టాన్ని తీసుకొస్తున్న సర్కార్‌.. దానికి రాష్ట్రపతి ఆమోదాన్ని పొందాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో 2016 చట్టంపై రాష్ట్రపతిని కలిసి ఆమోదించవద్దని వేడుకునేందుకు ఆలిండియా లాయర్స్‌ అసోషియేషన్‌ సిద్ధమవుతోంది. 2016 చట్టం ఆమోదం పొందినట్లయితే.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది న్యాయవాదుల సంఘం.

న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను విపక్షాలు స్వాగతిస్తుంటే... మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా సర్కారు భూసేకరణ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, హైకోర్టు తీర్పు తమకు ఎంతో నైతిక బలాన్నిచ్చిందని నిర్వాసితులు చెబుతున్నారు... ఆ క్రమంలో ఇకనైనా 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేసి .. అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com