`మా` అసోసియేషన్ సంతాపం ఓంపురి మృతికి

- January 07, 2017 , by Maagulf
`మా` అసోసియేషన్ సంతాపం ఓంపురి మృతికి

విలక్షణత కేరాఫ్ ఓంపురి. నటుడిగా దశాబ్ధాల చరిత్ర ఆయన సొంతం. ఎన్నో వైవధ్యమైన పాత్రలకు జీవం పోసిన ఆయన తిరిగిరాని అనంతలోకాలకు పయనమయ్యారు. 66 ఏళ్ల ఓంపురి నేటి ఉదయం గుండెపోటుతో స్వగృహంలో మృతి చెందారు. ఈ మరణంతో బాలీవుడ్‌ విషాదంలో మునిగిపోయింది.
ఓంపురి హర్యానా- అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో 18 అక్టోబర్‌, 1950లో జన్మించారు. పుణె- ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో సినిమా విద్యను అభ్యసించారు. 1976లో మరాఠీ చిత్రం ఘాశీరామ్‌ కొత్వాల్‌తో వెండితెర ఆరంగేట్రం చేశారు. 1982లో అరోహణ్‌, 1984లో అర్ధ్‌ సత్య చిత్రాలకుగాను ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కీర్తి కిరీటంలో చేరింది.
ఓంపురి తెలుగులో అంకురం చిత్రంలో నటించారు. ఈ గ్రేట్ యాక్టర్‌ మరణంపై టాలీవుడ్ నుంచి మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ సందర్భంగా మా అసోసియేషన్ అధ్యక్షుడు డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ప్రతిభా పాటవాలు, సృజనాత్మకత, నిజాయితీ, నిబద్ధత కలిగి దృఢ సంకల్పంతో నిరంతర నటయోధుడిగా విజయవంతమైన పయనం సాగించారు ఓంపురి. ఆయన లేని లోటు తీర్చలేనిది. తెలుగు నటీనటులందరి తరపున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు. భారతీయ సినీపరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని మా ప్రధాన కార్యదర్శి శివాజీరాజా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com