రానున్న పెప్సీ రాజధాని, కోక్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు.!

- January 09, 2017 , by Maagulf
రానున్న పెప్సీ రాజధాని, కోక్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు.!

ప్రయాణికులకు విజ్ఞప్తి.. 'పెప్సీ రాజధాని', 'కోక్‌ శతాబ్ది' ఎక్స్‌ప్రెస్‌లు ప్లాట్‌ఫామ్‌పైకి మరికొన్ని రోజుల్లో రానున్నాయి! అవును.. మీరు విన్నది నిజమే! త్వరలో భారత రైళ్లు 'బ్రాండ్‌' మయం కానున్నాయి. అంటే ఆయా కార్పొరేట్‌ సంస్థలు రైళ్లను దీర్ఘకాలిక ఒప్పందంపై తీసుకొని వాటిపై తమ ప్రకటనలను ప్రచురించుకుంటాయన్నమాట. రైల్వే స్టేషన్లతో కూడా ఇదే విధమైన ఒప్పందం చేసుకోనున్నాయి. ప్రయాణ, సరకు రవాణా ఛార్జీలు పెంచకుండానే ఆదాయం సమకూర్చుకునే దిశగా రైల్వేశాఖ ఈ కొత్త ప్రణాళిక రచించింది. దీని కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే రైల్వే బోర్డుకు చేరగా.. వచ్చేవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రకారం..

కార్పొరేట్‌ సంస్థ మొత్తం రైలును ఏకీకృత మీడియా హక్కులను దీర్ఘకాలిక ఒప్పందం ప్రాతిపదికన కొనుగోలుచేస్తుంది. అనంతరం బోగీ లోపలా బయటా ప్రకటనలు వేసుకుంటుంది. ఇదే విధానం రైల్వే స్టేషన్లకు కూడా వరిస్తుంది. ఇందుకోసం కార్పొరేట్‌ సంస్థలతో రైల్వేశాఖ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోనుందని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. తొలుత రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 'బ్రాండింగ్‌' విధానాన్ని ప్రవేశపెట్టి దశలవారీగా మిగిలిన రైళ్లలో విస్తరించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. రైళ్లతో పాటు, లెవెల్‌ క్రాసింగులు, ట్రాక్‌ల పక్కన పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటుచేసి ప్రకటనల రూపంలో సొమ్ములు రాబట్టాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. అంతేకాక ఫ్లాట్‌ఫాంలపై 2వేల వరకు ఏటీఎంలను ఏర్పాటు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రధాని మోదీ చేసిన సూచనల మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై భారం పడకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆదాయం సమకూర్చుకోవాలని ఆయన చేసిన సూచనల మేరకు కొత్త ప్రణాళికను రైల్వేశాఖ సిద్ధం చేసింది. కాగా, యూపీఏ హయాంలోనూ ఇలాంటి ప్రణాళికనే రూపొందించగా.. అది కార్యరూపం దాల్చలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com