విమానాశ్రయాల్లో నిఘా...
- January 13, 2017
కరడుగట్టిన నేరగాళ్ల కోసం వేట
హైదరాబాద్: నేరం జరిగిన సందర్బాల్లో సాధారణ నేరగాళ్లయితే వెంటనే పోలీసులకు దొరికిపోతారు. ఆ తర్వాత కేసు వాయిదాలకు ఒళ్లు దగ్గర పెట్టుకొని హాజరవుతుంటారు. అదే కరడుగట్టిన నేరగాళ్లయితే అందుకు అతీతం. వీరిలో కొందరు న్యాయస్థానాలకు తరచూ గైర్హాజరు కావడం సాధారణం. నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా సరే.. చిక్కకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. మరికొందరైతే పోలీసుల కళ్లు గప్పి ఏకంగా విదేశాలకు పారిపోతారు. అలాంటి వారిని పట్టుకొచ్చి న్యాయస్థానంలో హాజరు పరచడం అంత సులభం కాదు.
అందుకు భారీ కసరత్తే అవసరం. ప్రస్తుతం రాచకొండ పోలీసులు ఈ పనిలో నిమగ్నమయ్యారు.
సైబరాబాద్ విభజన అనంతరం ఏర్పడిన రాచకొండ కమిషనరేట్ పరిధి ప్రస్తుతం భారీగా విస్తరించింది. విస్తీర్ణం పరంగా దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా ఏర్పడింది. ఈనేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్‌బీనగర్ జోన్లతోపాటు యాదాద్రి రెవెన్యూ జిల్లాతో కూడిన జోన్ అవతరించింది. సాధారణంగానే ఎల్‌బీనగర్, మల్కాజిగిరి జోన్లు క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా ఉండగా.. యాదాద్రి జోన్ చేరికతో నేరాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఇటీవల షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కరడుగట్టిన నేరస్థుడు నయీం స్వస్థలం భువనగిరి యాదాద్రి జోన్‌లోనే ఉంది.. అతడితోపాటు అతడి అనుచరుల కార్యకలాపాలు ఈ ప్రాంతంలో జరిగినవే. ఈ నేపథ్యంలో నేరాల సంఖ్యను నియంత్రణలోకి తెచ్చే విషయంపై కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టి సారించారు. ముఖ్యంగా కరడుగట్టిన నేరగాళ్లను నియంత్రించేందుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
లుక్ అవుట్ నోటీసుల జారీపై కసరత్తు
ముఖ్యంగా తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉండి న్యాయస్థానం వాయిదాలకు గైర్హాజరవుతున్న వారిని గుర్తించి న్యాయస్థానంలో హాజరు పరచడం కోసం ప్రత్యేక బృందాలకు బాధ్యతలు అప్పగించారు. ఈక్రమంలో విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తున్న నేరగాళ్ల కోసం విమానాశ్రయాల్లో నిఘా ఏర్పాటు చేసేలా వ్యూహరచన చేశారు. ఆయా నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. వారి పేరిట లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాంటి వారి జాబితాను రూపొందించి దేశంలోని అన్ని విమానాశ్రయాలకు వారిపై ఎల్‌ఓసీలు జారీ చేయడంపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ఎల్‌ఓసీ జారీ అయిన పక్షంలో ఒకవేళ నేరగాళ్లు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా వెంటనే గుర్తించి పట్టుకునేందుకు అవకాశముంటుంది. నగర పోలీసులు ఇదే తరహాలో పాతబస్తీ రౌడీషీటర్ అయూబ్‌ఖాన్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి ముంబయి విమానాశ్రయంలో దిగి హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నించిన క్రమంలో ఇతడిని అక్కడి కస్టమ్స్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకోగలిగారు. ఈక్రమంలో రాచకొండలో ఎల్‌ఓసీలను జారీ చేసేందుకు అవకాశం గల నేరస్థుల జాబితాను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్న ఎన్‌బీడబ్ల్యూలను జారీ చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
కమిషనరేట్‌లో ఎన్‌బీడబ్ల్యూలు ఇలా..
2016 జూన్ వరకు అపరిష్కృతంగా ఉన్నవి: 1876
2016 జులై నుంచి నవంబరు నాటికి జారీ అయినవి: 1816
జులై నుంచి నవంబర్ వరకు జారీ చేసినవి: 1981
నవంబరు నెలాఖరు నాటికి జారీ చేయనివి: 1711
శిక్షల పెంపు దిశగా కసరత్తు
న్యాయస్థానాల్లో శిక్షల శాతం పెంచేందుకు అవసరమైన సాక్ష్యాధారాల సేకరణపై కమిషనర్ శ్రద్ధ తీసుకుంటున్నారు. ట్రయల్స్ సమయంలో సాక్షులకు భరోసా ఇవ్వడం ద్వారా వారిని న్యాయస్థానాలకు రప్పించడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో 2016లో శిక్షల శాతం పెరగడం విశేషం. ముందు ఏడాదితో పోల్చితే గతేడాది సుమారు పది వరకు శిక్షల శాతం మెరుగుపడింది.
మొత్తం కేసుల పరిష్కారం: 6,211
శిక్షలు ఖరారైనవి: 1,632
కొట్టివేతకు గురైనవి: 2,804
శిక్షల శాతం: 26
తాజా వార్తలు
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!









