26న వైజాగ్‌ ఆర్కే బీచ్‌కు వెళుతున్న మొదటి హీరో ఇతనే!

- January 24, 2017 , by Maagulf
26న వైజాగ్‌ ఆర్కే బీచ్‌కు వెళుతున్న మొదటి హీరో  ఇతనే!

ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ యువత ఈ నెల 26న తలపెట్టిన ఆందోళనా కార్యక్రమానికి సినీ రంగం నుంచి మద్ధతు పెరుగుతోంది. పవన్ కల్యాణ్ స్పందించడం మూలానో, లేదా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారో కానీ చాలామంది ఈ నిరసన కార్యక్రమానికి మద్ధతుగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. హీరో సంపూర్ణేష్ బాబు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అయినప్పటికీ ఏపీ యూత్ చేపట్టిన నిరసన కార్యమానికి మద్ధతుగా ట్వీట్స్ పెడుతుండటం విశేషం. అయితే ఏపీ యూత్ మాత్రం కేవలం ట్వీట్స్ పెడితే సరిపోదని, తమిళ హీరోల్లాగా తెలుగు హీరోలంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.

ఈ డిమాండ్‌పై సంపూర్ణేష్ బాబు స్పందించాడు. వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న జరగబోయే హోదా సాధన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశాడు. వైజాగ్‌కు టికెట్ కూడా కన్ఫార్మ్ అయినట్లు సంపూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 26న ఆర్కే బీచ్‌లో కలుద్దామన్నాడు.

ప్రత్యేక హోదాపై పవన్ నినాదాన్ని సంపూ మరోసారి ట్వీట్ చేశాడు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్ధతు తెలపడం లేదని, యువత చేస్తున్న పోరాటానికే తాను సపోర్ట్ చేస్తున్నానని సంపూర్ణేష్ బాబు తెలిపాడు. అయితే ఈ కార్యక్రమానికి మద్ధతు పలికిన జనసేన అధినేత పవన్ ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. దీంతో ఈ ఆందోళనకు మద్ధతుగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళుతున్న వారిలో సంపూనే మొదటివాడు కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com