రివ్యూ : ఘాజీ...
- February 16, 2017
రివ్యూ :
సినిమా పేరు: ఘాజీ
నటీనటులు: రానా.. కె.కె.మీనన్.. అతుల్ కులకర్ణి.. తాప్సి.. ఓంపురి.. నాజర్.. సత్యదేవ్.. భరత్‌రెడ్డి తదితరులు
సంగీతం: కె
ఛాయాగ్రహణం: మది
కూర్పు: శ్రీకర్‌ప్రసాద్
నిర్మాణ సంస్థలు: పీవీపీ సినిమా..
మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన - దర్శత్వం: సంకల్ప్
విడుదల: 17-02-2017
యు ద్ధం.. దేశభక్తి.. ఇవి కూడా కమర్షియల్ అంశాలే. ఎంతటి కర్కోటకుడికైనా తన దేశంపై కొద్దో గొప్పో ప్రేమ ఉంటుంది. కాలు దువ్విన శత్రుదేశంపై తడాఖా చూపించిన సందర్భం వచ్చినప్పుడు.. తప్పకుండా గర్వంతో ఛాతీ ఉప్పొంగుతుంది. కానీ అలాంటి బలమైన భావోద్వేగాల్ని చూపించగలగాలి. ‘ఘాజీ’ అలాంటి ప్రయత్నమే చేసింది. చరిత్రలో జరిగిన ఓ సంఘటనని కళ్లకు కట్టినట్టు చూపించింది.
ఇండియా - పాకిస్థాన్ యుద్ధంలో మరో కోణాన్ని.. చరిత్ర మరిచిన సత్యాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమైంది? ఈ ‘ఘాజీ’ ఎవరికి నచ్చుతుంది? నటీనటులు.. సాంకేతిక నిపుణుల పని తీరు ఎలా ఉంది? అన్నది చూస్తే..
కథేంటంటే..?: 1971లో ఇండియన్ సబ్‌మెరైన్ ఎస్ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే నీటి యుద్ధం ఈ కథ. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ (రానా).. కెప్టెన్ రణ్ విజయ్‌సింగ్ (కె.కె.మీనన్)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.
ఎలా ఉందంటే..?: ఇండియా - పాక్ యుద్ధమంటే మనందరికీ కార్గిల్ యుద్ధం.. లేదంటే అంతకు ముందు జరిగిన కొన్ని యుద్ధాలే తెలుసు. సముద్ర గర్భంలోనూ ఇండియా - పాక్‌లు హోరాహోరీగా తలపడ్డాయని, ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ధృఢచిత్తంతో శత్రువుల్ని ఎదుర్కొని విజయం సాధించారన్న చరిత్రకు ‘ఘాజీ’ అద్దం పట్టింది.
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్ మెరైన్ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే.. విసుగు అనిపించదు. తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల్లో.. ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడం తప్పనిసరి. అప్పుడే తెరపై ప్రధాన పాత్రలు ఎంత భావోద్వేగంతో రగిలిపోతాయో.. ప్రేక్షకుల్లోనూ అలాంటి స్పందనే కలుగుతుంటుంది. ఈ విషయంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సందర్భంలో.. ఘాజీని మట్టుపెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మనసులో ‘జైహింద్’ అనుకోకుండా ఉండలేడేమో..?!
అతి తక్కువ పాత్రలతో.. ‘యుద్ధం’ అనే ఒకే లైన్‌తో రెండు గంటలు కూర్చోబెట్టడం.. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. కానీ.. అవేవీ ఇబ్బందిని కలిగించవు. కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వాతావరణం అలవాటైన తర్వాత.. శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో విజయవంతమైంది చిత్ర బృందం.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో పాత్రలు తప్ప పాత్రధారులెవ్వరూ కనిపించనట్లుగా ఉంది. రానా ఈ కథని.. ఈ పాత్రనీ ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్ పాత్రని ప్రేమిస్తాం. అతను తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. తాప్సిని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.
కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కేవలం నేపథ్య సంగీతంతోనే కలిగించారు. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్ సెట్లో.. కెమెరాని పరుగులు పెట్టించాడు. సంకల్ప్ ఆలోచన.. అతని స్క్రీన్ ప్లే ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని చిత్రంగా మలిచాయి.
బలాలు
కథనం, యుద్ధ సన్నివేశాలు, ఎమోషన్
- బలహీనతలు
కథలో మిళితమైన టెక్నికల్ అంశాలు
చివరగా.. దేశభక్తిని నింపిన ‘ఘాజీ’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









