ఐపీఎల్ వేలం పాటకు కౌంట్‌డౌన్
- February 20, 2017
ఐపీఎల్ వేలం పాటకు కౌంట్‌డౌన్ మొదలైంది. పదో సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పులో నిమగ్నమయ్యాయి. పలువురు స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ ఆక్షన్‌లో ఉండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వీరితో పాటు దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తోన్న యువ ఆటగాళ్ళలో ఎవరికి జాక్‌పాట్ దక్కనుందో ఇవాళ తేలిపోనుంది. గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే ఈ సారి జరగబోయే ఆటగాళ్ళ వేలం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్పాట్‌ఫిక్సింగ్ వివాదం తర్వాత లోథా కమిటీ సూచనలతో గందరగోళంలో ఉన్న బీసిసిఐ బెంగళూరులో వేలం నిర్వహిస్తోంది. బోర్డు పెద్దలపై ఇటీవలే సుప్రీంకోర్ట్ వేటు వేసిన నేపథ్యంలో ఆటగాళ్ళ వేలంపై ఎటువంటి ప్రభావం పడకుండా చూసేందుకు బీసిసిఐ పూర్తి స్థాయిలో సిధ్ధమైంది. లోథా కమిటీ ఈ వేలానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు విధించకపోవడం వారికి కాస్త ఊరటనిచ్చే అంశం. మరోవైపు పదో సీజన్ కోసం జరగబోయే ఈ వేలంలో ఫ్రాంచైజీల వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పలువురు కీలక ఆటగాళ్ళను తమతోనే కొనసాగించుకునే నిబంధనను ఉపయోగించుకున్నాయి. ఈ సారి జరిగే వేలంలో మొత్తం 351 మంది క్రికెటర్లు బరిలో ఉండగా... వీరిలో 226 మంది భారత క్రికెటర్లు... మిగిలిన 125 మంది విదేశీ ప్లేయర్లు. ఈ ఆక్షన్‌లో భారత పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇదే బేస్ ప్రైస్‌లో మాథ్యూస్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ , మిఛెల్ జాన్సన్, మోర్గాన్, పాట్ కమ్మిన్స్ ఉన్నారు. వీరిలో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌పై భారీ అంచనాలున్నాయి. షార్ట్ ఫార్మేట్‌లో మంచి రికార్డున్న స్టోక్స్ కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ నడుస్తుందని అంచనా. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతోన్న భారత యువ ఆటగాళ్ళలో విష్ణువినోద్, తన్మయ్ అగర్వాల్, బసిల్ తంపి, మహ్మద్ సిరాజ్, ఇశాంక్ జగ్గితో పాటు నటరాజన్‌పై అంచనాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్లేయర్స్ తన్మయ్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్‌లకు జాక్‌పాట్ తగిలే అవకాశముంది. 21 ఏళ్ళ తన్మయ్ ఇటీవలి ఇంటర్ స్టేట్ టీ ట్వంటీ టోర్నీలో 250 పరుగులతో సత్తా చాటాడు. ఇక ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. హైదరాబాద్ జట్టు రంజీ క్వార్టర్ ఫైనల్ చేరడంలో సిరాజ్‌దే కీరోల్. తాజాగా సయ్యద్ ముస్తాక్ టీ ట్వంటీల్లోనూ సిరాజ్ 9 వికెట్లతో ఫామ్ కొనసాగించాడు. ఇటీవలే రెస్ట్ ఆఫ్ ఇండియా,ఇండియా ఎ జట్లకు ఎంపికైన సిరాజ్‌కు ఐపీఎల్ జాక్‌పాట్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







