బంగారం దొరికిందట కరెంటు స్థంభాల కోసం తవ్వుతుంటే

- March 09, 2017 , by Maagulf
బంగారం దొరికిందట కరెంటు స్థంభాల కోసం తవ్వుతుంటే

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంగారం ఆశ చూపుతూ మయగాళ్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వరస ఘటనలు మరవకముందే సిరిసిల్లలో మరో బంగారం మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత వృద్ధ దంపతుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం అంకుసాపురం గ్రామానికి చెందిన దైవాల లక్ష్మీనారాయణ, లక్ష్మీ దంపతులు వ్యవసాయం చేస్తుండేవారు. ఐదు నెలల నుంచి సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌లో ఉంటూ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన గుణ్‌సింగ్‌(విష్ణు) తరుచూ దుకాణానికి రావడంతో అతనితో పరిచయం పెరిగింది. ఓ రోజు హడావుడిగా లక్ష్మీనారాయణ దగ్గరికి వచ్చి తాను అగ్రహారంలో కరెంట్‌ స్థంభాల కోసం గుంత తీస్తుండగా బంగారం దొరికిందని, తమ ఊరికి రైలులో బంగారం తీసుకుపోవడం కష్టమంటూ తక్కువ ధరకే ఇస్తానంటూ గొలుసులోని రెండు గుండ్లు ఇచ్చాడు.
అవి అసలు బంగారమేనని చెప్పడంతో బాధితుడు లక్ష రూపాయల నగదు, భార్య మెడలోని మూడున్నర తులాల గొలుసు, ఆరు గ్రాముల చేతి ఉంగరం, 50 తులాల వెండిని ఇచ్చి అతని వద్దన ఉన్న కేజీ బంగారు గొలుసులను తీసుకున్నాడు. వారం తర్వాత ఆ గొలుసులను బంగారు దుకాణానికి తీసుకెళ్లగా రోల్డ్‌గోల్డ్‌ అని తేలింది. ఏం చేయాలో అర్థకాకపోవడంతో లక్ష్మీనారాయణ గుణ్‌సింగ్‌ కోసం వెతకడం ప్రారంభించాడు. జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆ దంపతులు భయపడుతున్నారు. 
గతంలోనూ ఇదే తరహాలో.. ఫిబ్రవరి 15న ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన వృద్ధురాలు బాస ఎల్లవ్వ కూరగాయలు తీసుకోవడానికి సిరిసిల్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. కొందరు ఆడవాళ్లు మాటువేసి రోడ్డుపైన బంగారం కడ్డీ వేసి సినీఫక్కీలో వృద్ధురాలిని మోసం చేసి ఆమె మెడలోని రెండు తులాల బంగారాన్ని తీసుకొని ఉడాయించారు. అదేవిధంగా సిరిసిల్ల మండలం రగుడుకు చెందిన కొండవేణి కిరణ్‌కుమార్‌ యాదవ్‌కు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిమెంట్‌ సరఫరా చేసే లారీ డ్రైవర్‌ రమేశ్‌ తన పొలంలో 10 కిలోల బంగారం దొరికిందని కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించాడు. అత్యాశతో రూ 10 లక్షలు కూడబెట్టి కర్ణాటకు వెళ్లి మరీ డబ్బులు ఇచ్చి బంగారాన్ని తెచ్చుకొని మోసపోయాడు కిరణ్ కుమార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com