భారత్‌పై అణు యుద్ధం చేయనున్న పాకిస్తాన్

- March 10, 2017 , by Maagulf
భారత్‌పై అణు యుద్ధం చేయనున్న పాకిస్తాన్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు అణు యుద్ధానికి తెగించే అవకాశాలు ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ జోసఫ్ వోటెల్ హెచ్చరించారు. సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీకి ఆయన భారతదేశం, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల గురించి గురువారం వివరించారు. భారతదేశం-పాకిస్థాన్ మధ్య ప్రస్తుత ఘర్షణలు అణు దాడులకు దారి తీయవచ్చునని జనరల్ జోసఫ్ తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు దాడులు చేయడంతో భారతదేశం ప్రతిస్పందించే అవకాశం పెరుగుతుందని, దీంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నిరంతర ఉద్రిక్తతలు ఉన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఉంటున్న, భారతదేశంపై గురిపెట్టిన ఉగ్రవాదులపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై భారతదేశం ఆందోళన చెందుతోందన్నారు.

భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ఆ దేశం సైనికపరంగా స్పందించిందని తెలిపారు. ఇటువంటి దాడులు, ప్రతిస్పందనల వల్ల ఇరు దేశాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు దౌత్యపరంగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఆటంకాలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఉభయ దేశాలు అణ్వాయుధ దేశాలు కావడంతో ఈ పరిస్థితులు అణు దాడులకు దారి తీసే అవకాశాలను సూచిస్తున్నాయన్నారు. అమెరికా గుర్తించిన 20 ఉగ్రవాద సంస్థల్లో 7 పాకిస్థాన్‌లోనే ఉన్నాయని జనరల్ జోసఫ్ తెలిపారు. వీటికి పాకిస్థాన్‌లో రక్షణ ఉన్నంత కాలం ఆఫ్ఘనిస్థాన్ దీర్ఘకాలిక సుస్థిరతకు ముప్పు తప్పదని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com