38 మంది మృతి జనాలపైకి దూసుకెళ్లిన బస్సు..

- March 12, 2017 , by Maagulf
38 మంది మృతి జనాలపైకి దూసుకెళ్లిన బస్సు..

కరీబియన్‌ దేశం హైతీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జనాలపైకి దూసుకెళ్లడంతో 38 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. రాజధాని పోర్ట్‌-ఆ-ప్రిన్స్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొనైవ్స్‌ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దూరప్రాంతాలకు పర్యాటకులను చేరవేసే బ్లూ స్కై అనే సంస్థకు చెందిన బస్‌ ముందుగా ఇద్దరు పాదచారులను ఢీకొనడంతో వారిలో ఒకరు మృతి చెందారు. దీంతో అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో డ్రైవర్‌ బస్సు వేగాన్ని పెంచడంతో అదుపుతప్పి మూడు స్ట్రీట్‌ మ్యూజిక్‌ బృందాలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైందని హైతీ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఆఫీస్‌ హెడ్‌ మేరీ-ఆల్టా జీన్‌ బాప్టిస్ట్‌ వెల్లడించారు.
ఈ ఘటనలో గాయపడిన 17 మందిని ఆసుపత్రికి తరలించగా.. వారిలో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు కారణమైన బస్సును స్థానికులు తగలబెట్టడానికి ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి పారిపోయిన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదంపై హైతీ ప్రెసిడెంట్‌ జొవెనల్‌ మొయిస్‌ తీవ్ర సంతాపం తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com