భగవంతుడు ఇచ్చిన భిక్ష సినిమాలు

- March 18, 2017 , by Maagulf
భగవంతుడు ఇచ్చిన భిక్ష సినిమాలు

‘‘నే నెప్పుడూ సినిమాని కేవలం సినిమాగా చూడను. నా భావాలు, ఆలోచనలకు ప్రతిరూపాలు అనుకొంటా. కొన్ని సినిమాల్లో నేను చెప్పిన సంభాషణలు నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయ’’న్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాటమరాయుడు’. శ్రుతిహాసన్‌ నాయిక. డాలీ దర్శకుడు. శరత్‌ మరార్‌ నిర్మాత. ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ప్రచార చిత్రం, పాటల సీడీని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఆవిష్కరించారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. సాంకేతిక నిపుణుణ్ని అవుదామనుకొన్నా. నటుణ్ని అవుతానన్న నమ్మకం నాకు ఉండేది కాదు.
అయితే నాకు ఏ పని ఇచ్చినా... అది తోట పని కావొచ్చు, వీధులు వూడ్చే పని కావొచ్చు... నిజాయతీగా చేస్తా. అలా సినిమాల్ని భగవంతుడు ఇచ్చిన భిక్ష అనుకొని ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేశా.
భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అంతే నిజాయతీతో పని చేస్తా. ప్రజాక్షేమం జరగాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాదు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. నా బిడ్డ ఒకరు, మీ బిడ్డలు ఒకరు కాదు.

అందరి బిడ్డలూ ఒక్కటే. నా సినిమాల్లోని కొన్ని సంభాషణలు నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. ‘గోకులంలో సీత’లో మిత్రుడు త్రివిక్రమ్‌ రాసిన ‘ప్రేమే దైవం.. ప్రేమే సర్వం.

ప్రేమే సృష్టికి మూలం..’ అనే డైలాగ్‌ ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. ‘సుస్వాగతం’ క్లైమాక్స్‌ సమయంలో నిజంగా ఏడ్చా. సీన్‌ చేస్తున్నప్పుడు ఏడుపు రాకపోతే చెంపమీద కొట్టుకొని మరీ ఏడ్చి నటించా. 40 టేకులకు ఆ సన్నివేశం పూర్తి చేశా.
నిజంగా నా తండ్రి చనిపోతే కూడా నేను ఇంతగా ఏడుస్తానా అనిపించింది. ‘జల్సా’ సమయంలో మా నాన్నగారు చనిపోతే ఏడుపు రాలేదు. బాధ్యత లేని ప్రేమ.. ఏం ప్రేమ అనుకుంటున్నప్పుడు ‘తొలిప్రేమ’ కథ నా దగ్గరకు వచ్చింది.
ఇలా నాలోని భావాలు సినిమాల రూపంలో బయటకు వచ్చేవి. ‘తమ్ముడు’ కోసం చాలా కష్టపడ్డా. ప్రాణం పణంగా పెట్టేశా. ఎప్పుడో నేర్చుకొన్న మార్షల్‌ ఆర్ట్స్‌ మళ్లీ చూపించాల్సివచ్చింది.

ఓ పిచ్చి, ఉన్మాదం, ఇష్టంతో కష్టపడ్డా. ‘తమ్ముడు’లో ‘నువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు’ అని యువతకు చెప్పే హక్కు, అధికారం ఎవ్వరికీ లేవు అని చెప్పాం. ‘బద్రి’లోని ‘నువ్వు నందా అయితే నేను బద్రి...

బద్రీనాథ్‌’ అనేది కేవలం డైలాగ్‌ కాదు. ఎదిగే ప్రతి ఒక్కడూ మరొకణ్ని తొక్కేద్దామనుకొంటాడు. ఎక్కువ తక్కువలు ఉండవు. అందరూ మనుషులే అని చెప్పడం ఆ డైలాగ్‌ ముఖ్య ఉద్దేశం.

దేశాన్ని ఎంత ప్రేమించాలి అనే విషయాన్ని ‘ఖుషి’లో ‘ఏ మేరా జహా...’ పాట రూపంలో చెప్పాం. ఆ సినిమా చూస్తున్నప్పుడు ‘రాబోయే కొన్ని సంవత్సరాలు గడ్డుకాలం అనుభవించక తప్పదు’ అనే భావం నాలో కలిగింది. నీరసం వచ్చేసింది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశా.
అప్పుడు కోల్పోయిన శక్తి ‘గబ్బర్‌సింగ్‌’లో పోలీస్‌ స్టేషన్‌లో సీన్‌ చేస్తున్నప్పుడు తిరిగి పొందగలిగా. నిరంతర పోరాటమే జీవితం. ఓరోజు పడిపోతాం. మరోసారి లేస్తాం.
గెలుపోటముల్ని సమానంగా చూడాలనిపించింది. ఇంతవరకు నేను తమ్ముడినే. తొలిసారిగా ‘కాటమరాయుడు’లో అన్నయ్యగా కనిపించబోతున్నా. డాలీ ప్రత్యేకమైన దర్శకుడు.
ఆయన సున్నితమైన హాస్యం నాకు నచ్చుతుంది. ప్రతీ సినిమానీ ఇష్టపడే చేస్తాం. ఈ సినిమా కూడా అంతే. అభిమానులకు నచ్చితే ఆశీర్వదించండి.
మీరు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నా’’ అన్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి కోట్లలో ఒకరికి ఇస్తాడు దేవుడు. ‘ఇటు వెళ్లు’ అని ఆదేశించగానే అక్కడ ఏముంది అనేది ఆలోచించకుండా పరుగెత్తే ప్రేమ, అభిమానం సంపాదించుకొనే శక్తి పవన్‌ లాంటివాళ్లకు ఇచ్చాడు దేవుడు. మనిషెప్పుడూ వూరి చివర మర్రి చెట్టులా ఉండాలి.
ఎండాకాలంలో నీడనిస్తుంది. వర్షాకాలంలో తడవకుండా గొడుగులా మారుతుంది. కానీ నన్ను గుర్తించమని అడగదు. అలా పవన్‌ కల్యాణ్‌ మౌనంగా వెనుక ఉండి సాయం చేసిన సందర్భాలు నాకు తెలుసు.
ఆయన నిలువెత్తు మంచితనం కాబట్టే ఇంత మంది అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ఆయనకు ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది. కొన్ని కోట్ల మంది కలసిన ఓ గొంతు పవన్‌. చాలామంది కలసి వేసే ఒక్క అడుగు పవన్‌’’ అన్నారు.
దర్శకుడు డాలీ మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల’ సమయంలో నాకు మరో సినిమా ఇస్తానని మాట ఇచ్చారు పవన్‌. ‘కాటమరాయుడు’తో దాన్ని నిలబెట్టుకొన్నారు. ఆయనతో మరో ఐదారు సినిమాలు చేస్తే గానీ దాహం తీరేట్టు కనిపించడం లేద’’న్నారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ ‘‘పవన్‌ కల్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేస్తాననుకోలేదు.
కానీ ఇది నా రెండో చిత్రం. ఈ అవకాశం ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ గారికి ధన్యవాదాల’’న్నారు. ‘‘అందరం ఓ టీమ్‌గా పనిచేశాం. మా లీడర్‌ ‘కాటమరాయుడు’.
పంచెకట్టులో పవన్‌ రెట్టింపు అందంతో కనిపించబోతున్నార’’ని నిర్మాత అన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, రామ్‌లక్ష్మణ్‌, శివబాలాజీ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ప్రసాద్‌ మూరెళ్ల, అజయ్‌, చైతన్య కృష్ణ, ఏఎం రత్నం, కమల్‌ కామరాజు, గౌతం రాజు, బండ్ల గణే†,ý రవి ప్రకాష్‌, నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com