తెరాస ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్‌ 27న వరంగల్‌లో

- March 21, 2017 , by Maagulf
తెరాస ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్‌ 27న వరంగల్‌లో

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వచ్చేనెల 27న వరంగల్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అదేరోజు లక్షలమంది కార్యకర్తలతో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆవిర్భావ సభ కంటే ముందు హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించి, అధ్యక్ష ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చిస్తామన్నారు. మంగళవారం రాత్రి మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడుతూ ఈ అంశాలను వెల్లడించారు. ఉద్యమ సమయంలో రికార్డు స్థాయిలో లక్షలమందితో వరంగల్‌లో భారీ సభ నిర్వహించామని, అంతకు రెట్టింపు స్థాయిలో ఈసారి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు.తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సభ ద్వారా ప్రజలకు సంపూర్ణ సందేశం ఇస్తామని తెలిపారు.
సభ్యత్వ నమోదు ముమ్మరం: పార్టీ ఆవిర్భావ దినానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేపట్టాలని సీఎం మంత్రులకు సూచించారు. వేదిక ఎంపిక ఇతర కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. జిల్లాల్లో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని, దీనికి మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గంలో నమోదు గతంలో కంటే బాగా పెరగాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట సెగ్మెంటు ఇన్‌ఛార్జీల నియామకానికి మంత్రులు సూచనలివ్వాలన్నారు. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టాలని, నియోజకవర్గానికి వేయి చొప్పున ఇళ్లను కేటాయించాలని, వాటికి స్థలాలను సేకరించి, వీలైనంత త్వరగా వాటిలో పనులు ప్రారంభించాలన్నారు.
సభలో మంత్రులు భేష్‌: బడ్జెట్‌ సమావేశాల్లో మంత్రులు బాగా సమాధానాలిస్తున్నారని కేసీఆర్‌ ప్రశంసించినట్లు తెలిసింది. పద్దులపై వారి వివరణలు బాగున్నాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com