భారతలో పర్యటించే విదేశీ పర్యాటకులకు సరళతర వీసాలు

- April 04, 2017 , by Maagulf
భారతలో పర్యటించే విదేశీ పర్యాటకులకు సరళతర వీసాలు

ఈ-వీసాలతో దేశంలో పర్యటించే విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించింది. ఇకపై వీరు రెండు నెలల వరకూ దేశంలో గడపవచ్చు. ఇప్పటి వరకూ ఈ గడువు 30 రోజుల వరకే ఉండేది. అంతేకాకుండా రెండు సార్లు దేశంలో ప్రవేశించవచ్చు. అదే వైద్య పర్యాటకులు అయితే మూడు సార్లు వచ్చి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ నెల ఒకటి నుంచి సరళీకరించిన ఈ-వీసా విధానం అమలులోకి వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. ఈ-వీసాతో రెండు మార్లు దేశంలో ప్రవేశించే వీలు కల్పించటం వల్ల విదేశీ పర్యాటకులు పొరుగునున్న భూటాన్‌, నేపాల్‌ వంటి దేశాలనూ నిర్ణీత గడువులోగా సందర్శించి వచ్చే వీలుకలుగుతుంది.
‘ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు వల్ల పర్యాటకం, వ్యాపారం, పెట్టుబడుల రంగాలకు సంబంధించి అధిక సంఖ్యలో సందర్శకులు రావటానికి వీలుకలుగుతుంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.
కొత్త ఉప విభాగాలివి.. 
ఈ-పర్యాటక వీసా, ఈ-వ్యాపార వీసా, ఈ-వైద్య వీసా...అనే మూడు ఉప విభాగాలుగా వీసాలను వర్గీకరించారు. వీటిని పొందే గడువును 30 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. అత్యవసరమైతే వ్యాపార, వైద్య వీసాలను 48 గంటల్లోనే మంజూరు చేస్తారు. వైద్య పర్యాటకులకు సహాయమందించేందుకు దేశంలోని ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో (దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌) ప్రత్యేక ఇమ్మిగ్రేషన్‌ కేంద్రాలను, సహాయ డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు.
సినిమా వాళ్లకు ప్రత్యేక వీసా 
సినీ రంగానికి చెందిన విదేశీయుల కోసం కొత్తగా ఫిల్మ్‌(ఎఫ్‌) వీసాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో ఏడాదిపాటు పలుమార్లు వచ్చి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ విద్యార్థుల కోసం విద్యంతర శిక్షణ (ఇంటెర్న్‌-ఐ)వీసాలు అందుబాటులోకి వచ్చాయి.
మొత్తం 161 దేశాల వారికి ఈ-వీసాలు మంజూరు చేస్తామని, దేశంలోని 24 విమానాశ్రయాల ద్వారా, మూడు నౌకాశ్రయాలు(కొచ్చిన్‌, గోవా, మంగళూరు) ద్వారా దేశంలోకి ప్రవేశించవచ్చని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ-వీసా మంజూరయ్యే విదేశీయులు ఈమెయిల్‌ ద్వారా తమకు అందే ధ్రువీకరణ ప్రతిని వెంట తీసుకొచ్చి తగిన పత్రాలను చూపి దేశంలోకి ప్రవేశించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com