తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే!
- April 06, 2017
తె లుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రతిపాదనకు మోక్షం లభించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మార్గం ద్వారా ఒక రాజధాని నుంచి మరో రాజధానికి వెళ్లేందుకు మూడు గంటలకు మించకపోవచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్- అమరావతి, హైదరాబాద్- బెంగళూరు మధ్య రెండు ఎక్స్‌ప్రెస్ వే మార్గాలను నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. తొలిదశలో రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానం కోసం హైదరాబాద్-అమరావతి మార్గానికి రంగం సిద్ధం చేయాలని నిర్ణయించింది.
రెండున్నరేళ్లుగా ఈ ప్రతిపాదనపై కదలిక లేదు. తాజాగా ఈ మార్గం నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంటు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కసరత్తు చేయాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.
275 కి.మీ.కు పైగా..: హైదరాబాద్-అమరావతి నగరాల మధ్య 275-285 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా. ఎటు నుంచి మార్గాన్ని నిర్మించాలన్నది కన్సల్టెంటు అధ్యయనం చేయాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్- పిడుగురాళ్ల- సత్తెనపల్లి మీదుగా అమరావతికి అనుసంధానానికి అవకాశాలున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ మధ్య నాలుగు వరసల మార్గం ఉంది. ఆ రహదారి నిర్మాణ గుత్తేదారుతో ప్రభుత్వం సుమారు 20 ఏళ్లపాటు ఒప్పందం చేసుకుంది. ఆ మార్గాన్ని ఆరు వరసలకు విస్తరించేందుకు అవసరమైన స్థలం కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక మిగిలింది నాగార్జునసాగర్- పిడుగురాళ్ల- సత్తెనపల్లి మార్గమేనని అభిప్రాయపడుతున్నారు. మార్గం నిర్మాణానికి రూ.9-10 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. వచ్చే ఏడాది చివరిలోగా అధ్యయనం పూర్తవుతుందని భావిస్తున్నారు.
రెండో దశలో హైదరాబాద్-బెంగళూరు..: రెండోదశలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్గాన్ని కూడా పునర్విభజన చట్టంలో పేర్కొనడంతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ సూత్రప్రాయ ఆమోదాన్ని ప్రకటించారు. సుమారు 574 కి.మీ. మేర ఈ మార్గం నిర్మించాల్సి ఉంది. దీన్ని ఎటు నుంచి నిర్మించాలన్న అంశంపై ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంది. హైదరాబాద్ నాగ్‌పుర్ మధ్య మరో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలనీ కేంద్రం భావిస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







