రుద్రమదేవి: రివ్యూ
- October 08, 2015
గుణ టీం వర్క్స్ నటీనటులు : అనుష్క, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, నిత్యా మీనన్ సంగీతం : ఇళయరాజా సమర్పణ : శ్రీమతి రాగిణి గుణ నిర్మాత : గుణశేఖర్ దర్శకత్వం : గుణశేఖర్ విడుదల తేదీ : 09 అక్టోబర్ 2015 కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'రుద్రమదేవి'. గుణశేఖర్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'రుద్రమదేవి'గా అనుష్క నటించింది. రానా, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం అనేక విడుదల తేదీలను మార్చుకుంటూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఎలా ఉందో? సమీక్ష చదివి తెలుసుకోండి. కధ :: రుద్రమదేవి కథ చరిత్రగా ప్రతి ప్రేక్షకుడికి తెలిసిందే. చిత్రంలో.. కాకతీయ సామ్రాజ్యపు మహారాజు గణపతిదేవ చక్రవర్తి(కృష్ణంరాజు) భార్య, మహారాణి సోమాంబ(ప్రభ) పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. చక్రవర్తికి అమ్మాయి పుడితే.. దేశాన్ని ఆక్రమించుకోవడానికి సిద్దంగా ఉన్న సరిహద్దునున్న దేవగిరి మ్రాజ్యాధినేత(సింగణ్ణ) ఓపక్క, కుట్రలు.. కుతంత్రాలతో మహారాజును గద్దె దింపి రాజ్యం హస్తగతం చేసుకోవడానికి ఎదురుచూస్తున్న సవతి సోదరులు, సామంతులు మరోపక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం మహారాజుకు మగబిడ్డ జన్మించారని మహామంత్రి శివదేవయ్య(ప్రకాష్ రాజ్) రాజతంత్రం వేస్తాడు. ఆడబిడ్డను యువరాజు రుద్రమదేవుడు (అనుష్క) గా పెంచుతారు. చిన్నతనంలో యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తారు. ఈ విషయం రహస్యంగా ఉంచుతారు. రుద్రమదేవుడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. పాతికేళ్ల తర్వాత గుట్టు ప్రజలందరికీ తెలుస్తుంది. యువరాజు రుద్రమదేవుడుగా ఇన్నాళ్లు ప్రజలను నమ్మించిన యువరాణి రుద్రమదేవికి అప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? శత్రు రాజ్యం, సామంత రాజులు ఎలాంటి కుతంత్రాలు చేశారు..? రాణి రుద్రమదేవి తన ధీరత్వంతో సవాళ్లను ఎలా ఎదుర్కుంది..? నిడదవోలు యువరాజు చాళుక్య వీరభద్రుడు(రానా దగ్గుబాటి) రుద్రమదేవికి ఎలాంటి సహాయం చేశాడు..? రాజ్యంపై తిరుగుబావుటా ఎగురవేసిన బందిపోటు గోన గన్నారెడ్డి(అల్లు అర్జున్) కథేంటి..? తదితర ప్రశ్నలకు సమాధానాలు అందరికీ తెలిసినవే. చిత్రంలో ఎలా తెరకెక్కించారు అనేది ఆసక్తికరం. నటీనటుల పనితీరు :: అనుష్క : కథానాయికలకు ఇలాంటి పాత్రలు సవాళ్లు విసురుతాయి. వాటిని స్వీకరించిన అనుష్క, వందశాతం ప్రతిభ కనబరించింది. అనుష్క ఎత్తు, ఆహార్యం సరిగ్గా కుదిరాయి. రుద్రమదేవుడు, రుద్రమదేవిగా రెండు కోణాలున్న పాత్రలో చక్కగా నటించింది. కత్తి పట్టి కదనరంగంలో శత్రువు అంతు చూసినా.. అద్దంలో అందాలు చూసుకుంటూ ఓ ఆడపిల్లగా ఆలోచిస్తూ, రాజ్యం కోసం జీవితం త్యాగం చేసిన వీరవనితగా రెండు పాత్రల్లో మెప్పించింది. పాత్రలో వైవిధ్యం చూపించింది. యుద్ధం చేస్తుంటే నిజం అనిపించింది. పాటల్లో అందాలు ప్రదర్శనతో యువతను కవ్వించింది. చిత్రాన్ని తన భుజస్కందాలపై నడిపించింది. ప్రేక్షకులలో బలమైన ముద్ర వేసింది. అల్లు అర్జున్ : కొత్త వేషం వేశాడు, యాస మార్చాడు, హావభావాల్లో చాంతాడంత చమత్కారం చేశాడు, వెరసి గోన గన్నారెడ్డి పాత్ర నేను తప్ప మరొకరు చేయలేరు అన్నంతగా అల్లు అర్జున్ ఇరగదీశాడు అంటే అతిశయోక్తి కాదు. గతంలో బన్ని చేసిన పాత్రలన్నీ ఓ ఎత్తు, గోన గన్నారెడ్డి మరొఎత్తు. వినోదం, బందిపోటు తత్త్వం రెండూ చూపాడు. తెలంగాణ యాసలో 'గమ్మునుండవోయ్..', 'నా మొలతాడులో తాయత్తు.. ' వంటి మాటలు పలికిన తీరు ప్రేక్షకులు అంత త్వరగా మరువలేరు. నటుడిగా పరిణితి చెందాడు. పాత్ర నిడివి తక్కువైనా చిత్రంలో ప్రేక్షకుల మనసు దోచుకున్న బందిపోటు అతడే. రానా దగ్గుబాటి : చాళుక్య వీరభద్రుడిగా ఉన్నంతలో బాగా చేశాడు. యాక్షన్, పంచ్ డైలాగులు రెండూ పెద్దగా లేవు. పాటలో అనుష్కకు తగ్గ ఎత్తులో బాగున్నాడు. శివదేవయ్య : చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ కొత్త పాత్రలో కనిపించారు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో నటుడిగా తన అనుభవాన్ని రంగరించారు. డైలాగ్ డెలివరీ సినిమాకు హెల్ప్ అయ్యింది. గణపతి చక్రవర్తిగా కృష్ణంరాజు, ముక్తాంబగా నిత్యా మీనన్, ప్రసాదాదిత్యగా అజయ్, అనామికగా కేథరిన్ త్రెసా, మదనికగా హంసా నందిని ఆకట్టుకున్నారు. ఇతర కీలకమైన పాత్రల్లో పరభాషా నటులైన విక్రమ్ జిత్, రజా మురాద్ ఇబ్బందిపెట్టారు. డైలాగ్ కు తగ్గటు పెదాలను కదపడంలో విఫలమయ్యారు. సుమన్, ఆదిత్య మీనన్, బాబా సెహగల్, జయప్రకాశ్ రెడ్డి, శివాజీ రాజా, సన తదితరులు ఏమాత్రం ప్రభావం చూపలేదు. సాంకేతికవర్గం సంగీతం :: ఇళయరాజా పాటలు చిత్రానికి అనుగుణంగా ఉన్నాయి. 'పున్నమి పువ్వై.. ', 'అంతపురంలో.. ' పాటలను అందంగా చిత్రీకరించారు. అనుష్క అందాల ప్రదర్శన పాటలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేపథ్య సంగీతం ఇళయరాజా స్థాయిలో లేదు. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీఖర్ ప్రసాద్ ఎడిటింగ్.. పర్వాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ : తోట తరణి వేసిన బ్రహ్మాండమైన సెట్స్, దర్శకుడు గుణశేఖర్ ఊహలకు దృశ్యరూపం ఇచ్చిన విధానం అమోఘం. ఆ ఊహలను తెరపై ఆవిష్కరించడంలో విజువల్ ఎఫెక్ట్స్ బృందం సఫలీకృతం కాలేదు. పలు సన్నివేశాల్లో గ్రాఫిక్స్ అసహజత్వంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో బొమ్మలతో కథ నడిపించారు. అక్కడ రాజీ పడినా, కీలక సన్నివేశాల్లో చూసిన విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయని చెప్పడం మోసం చేయడమే.(ప్రీమియర్ షో 2డీలో ప్రదర్శించడం వలన దాని ఆధారంగా చెప్పడం జరిగింది) ఇటీవల తెలుగులో విడుదలయినా 'బాహుబలి'తో ప్రేక్షకులు కంపేర్ చేయడం ఈ చిత్రానికి పెద్ద మైనస్) దర్శకత్వం :: చరిత్రను వక్రీకరించకుండా సహజత్వానికి దగ్గరగా చెప్పడానికి దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నించారు. దర్శక, నిర్మాతగా ఎక్కువ భారం మోసారు. నటీనటుల నుంచి అత్యుత్తమ నటన రాబట్టారు. కానీ, చారిత్రాత్మక కథపై జరిపిన పరిశోధనలో విజువల్ ఎఫెక్ట్స్ మీద కూడా చేసుంటే బాగుండేది. ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచి చిత్రం బయటకోచ్చేది. గుణశేఖర్ ఊహ చాలా పెద్దది. ఊహకు సరిపడా నిర్మాణ వనరులు అతనివద్ద ఉన్నట్టు లేవు. కథ సంపూర్తిగా ఉంది. కథనం నెమ్మదిగా తాబేలు నడక నడిచింది. భావోద్వేగాలు బలంగా పండాల్సిన సన్నివేశంలో దర్శకుడు పట్టు విడవడంతో ప్రేక్షకుడు చిత్రంతో పాటు ప్రయాణం చేయడం కష్టమే. విశ్లేషణ :: కథ, కథలో మెయిన్ ట్విస్ట్ ప్రారంభంలోనే తెలుస్తుంది. చరిత్ర తెలిసింది కావడంతో దర్శకుడు కూడా దాచడానికి ప్రయత్నించలేదు. రుద్రమ'దేవుడు' కాదు రుద్రమ'దేవి' అని తెలిసే సందర్భం సినిమాలో కీలక ఘట్టం. అప్పటివరకూ మగబిడ్డలా పెరిగి, తను అబ్బాయిననే రుద్రమదేవికి తెలిసే సన్నివేశం మొదలుకుని.. సినిమాలో నాలుగైదు సందర్భాలలో కీలక ఘట్టాలు వచ్చాయి. ఒక్క సన్నివేశంలో కూడా దర్శకుడు బలమైన భావోద్వేగాలు రాబట్టడానికి.. కమర్షియల్ బాణిలో వాడుకోవడానికి ప్రయత్నించలేదు. అది చిత్రానికి ప్రతిబంధకంగా మారింది. తర్వాత సన్నివేశాల్లో ఎంత బాగా నటించినా, అక్కడ ఎమోషన్ వర్కౌట్ అయితే.. ప్రేక్షకుడు చిత్రంలో లీనమయ్యేవాడు. గుణశేఖర్ ఓ సువర్ణావకాశాన్ని వృధా చేసుకున్నాడా? అనిపిస్తుంది. అనుష్క, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్ పాత్రలను బాగా తీర్చిదిద్దారు. చోటా మోటా నటీనటులపై, చిన్న చిన్న సన్నివేశాలపై అంత దృష్టి పెట్టలేదు. పలు సన్నివేశాల్లో కాలయాపన జరిగింది. కొన్ని సన్నివేశాల అవసరమే లేదనిపించింది. ప్రేమకథను సైతం దర్శకుడు సరిగ్గా ఆవిష్కరించలేదు. ప్రారంభం నుంచి నెమ్మదిగా సాగుతున్న కథనం పతాక సన్నివేశాలకు అరగంట ముందు కదనరంగంలోకి ఆడుగుపెడుతుంది. యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. గతంలో వచ్చిన 'బాహుబలి'తో కంపేర్ చేస్తే కష్టమే. మంచి కథ, ప్రధాన నటీనటులు అత్యుత్తమ ప్రదర్శన, దర్శకుడి ఊహకు కమర్షియల్, విజువల్ ఎఫెక్ట్స్ హంగులు తోడైతే వెండితెరపై ఓ అద్బుతం ఆవిష్కారమయ్యేది. తనలో దర్శకుడి ఊహకు నిర్మాత గుణశేఖర్ శక్తికి మించి ఖర్చు చేసినా.. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమాకు నిండుదనం రాలేదు. అది పెద్ద ప్రభావమే చూపింది. గుణశేఖర్ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేం. బాహుబలి తరహాలో చిత్రం అంచనాలు లేకపోవడం లాభించే అంశం.
--మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 3/5
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









