గంటా రవి కెరీర్‌కు ఇది తొలి అడుగు మాత్రమే
- June 20, 2017
''లవర్ బాయ్‌గా కనిపించే కథతో కాకుండా, తన ఆహార్యానికి తగ్గట్లు టఫ్ పోలీసాఫీసర్ కేరక్టర్‌తో ఈ సినిమా చేయడం గంటా రవి సక్సెస్ ఫుల్ కెరీర్‌కు తొలి అడుగు. ఈ సినిమా కచ్చితంగా అలరించి, విజయం సాధిస్తుంది'' అని ఆశీర్వదించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'జయదేవ్'. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. అశోక్‌కుమార్ నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు కూర్చిన పాటలు మంగళవారం విడుదలయ్యాయి. ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన వేడుకలో బిగ్ సీడీని చిరంజీవి ఆవిష్కరించగా, ఆడియో సీడీలను మోహన్‌బాబు ఆవిష్కరించి, తొలి కాపీని కె. రాఘవేంద్రరావుకు అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ ''గంటా శ్రీనివాసరావుకు.. తన కొడుకు కంటే తనకే సినిమాలంటే ఎక్కువ మక్కువ అనిపిస్తుంటుంది. అప్పట్లో తన కుటుంబ పరిస్థితుల మూలంగా రిస్క్ తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి రాలేదేమో కానీ సినిమా రంగంలోని వాళ్లతో స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తనకు తీరని కోరిక తన కొడుకు ద్వారా తీర్చుకుంటున్నాననేది ఆయన ముఖంలోని ఆనందం ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. రవి ద్వారా ఆయన పుత్రోత్సాహం అనుభవిస్తున్నారు. రవికి ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి మున్ముందు ఆ పుత్రోత్సాహాన్ని ఇంకా ఎక్కువ అనుభవిస్తారనే నమ్మకం ఉంది. రవి 'మ్యాచో'గా ఉన్నాడు. హీరో మెటీరియల్. జయంత్ సి. పరాన్జీతో దర్శకత్వంలో చేయడమనేది అతనికి శుభారంభం. పాటల్లో తనను తాను చక్కగా ప్రెజెంట్ చేసుకున్నాడు. నాకెన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ ఈ చిత్రానికి చక్కని స్వరాలిచ్చాడు'' అని చెప్పారు.
రవి అందంగా ఉన్నాడు
మోహన్‌బాబు మాట్లాడుతూ ''తమ్ముడు లాంటి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవి హీరో అవుతున్నందుకు సంతోషంగా అనిపిస్తోంది. నేను 'స్వర్గం నరకం' చేసేప్పుడు రవిలా లేను. 'నువ్వు సినిమాలకు పనికొస్తావా? నీ ఫేస్ చూసుకున్నావా? నువ్వు యాక్టర్‌వా' అని నన్నడిగారు. అప్పటి నాతో పోల్చుకుంటే రవి చాలా అందంగా ఉన్నాడు. జీవితాంతం అతను నంబర్‌వన్‌గా మంచి నటుడవ్వాలని కోరుకుంటున్నా. ఇది పొగడ్త కాదు. ప్రతి పాటా మెలోడీతో ఉంది. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసిన జయంత్ ఇంతవరకు నాకు తన సినిమాలో అవకాశం ఇవ్వలేదు'' అన్నారు. రవి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని కె. రాఘవేంద్రరావు ఆశీర్వదించారు. తాను సినీ నిర్మాణం నుంచి వేరే వ్యాపారంలోకి వెళ్లానని, గంటా శ్రీనివాసరావు కుమారుడి కోసం మళ్లీ నిర్మాతనయ్యాననీ అశోక్‌కుమార్ తెలిపారు. డైరెక్టర్ జయంత్ చాలా బాగా సినిమా రూపొందించారనీ, మణిశర్మ అమేజింగ్ మ్యూజిక్ ఇవ్వగా, జవహర్‌రెడ్డి అమేజింగ్ సినిమాటోగ్రఫీ ఇచ్చారని గంటా రవి అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, అల్లు అరవింద్, టి. సుబ్బరామిరెడ్డి, బి. గోపాల్, వేణుగోపాలాచారి, దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, నిర్మాత కె. అశోక్‌కుమార్, నటుడు వినోద్‌కుమార్, హీరోయిన్ మాళవికా రాజ్, నట శిక్షకుడు సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.
చిరంజీవి
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







