తెలుగు తేజం శ్రీకాంత్ నెం.1 విజయం
- June 22, 2017
వారంలోనే వరల్డ్ నెం.1కు మళ్లీ షాక్
- క్వార్టర్స్‌లో సైనా, సింధు, సాయిప్రణీత్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
తెలుగు తేజం తెగువకు వరల్డ్ నెం.1 మరోమారు తలొంచాడు. సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న కిదాంబి శ్రీకాంత్ వారం వ్యవధిలోనే ప్రపంచ నెంబర్‌వన్ షట్లర్‌పై వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. సన్ వాన్ హోపై ఏకపక్ష విజయంతో శ్రీకాంత్ ఆధిపత్యం చాటుకున్నాడు. మరో సూపర్ సిరీస్ టైటిల్ వేటలో అలవోకగా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నేడు సెమీస్ దారిలో సహచర షట్లర్ బి. సాయిప్రణీత్‌తో శ్రీకాంత్ తాడోపేడో తేల్చుకోవాల్సి ఉన్నది.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
అగ్రశ్రేణి షట్లర్లపై ఏకపక్ష విజయాల పరంపర సిడ్నీలోనూ కొనసాగుతోంది. గత శనివారం జకర్తాలో వరల్డ్ నెం.1 సన్ వాన్ హో (దక్షిణ కొరియా)కు చెక్ పెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సిడ్నీలోనూ అదే ప్రదర్శన పునరావృతం చేశాడు. తొలి రౌండ్లో పారుపల్లి కశ్యప్‌ను ఓడించిన సన్ వాన్ హో.. ప్రీ క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ దాటికి నిలువలేదు. 15-21, 21-13, 21-13తో గెలుపొందిన శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో వరుసగా రెండో సూపర్ సిరీస్‌లో వరల్డ్ నెం.1 ఉట్టిచేతుల్తోనే నిష్క్రమించాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్‌లో సింగపూర్ హీరో బి. సాయిప్రణీత్ సైతం క్వార్టర్స్‌లో కాలుమోపగా.. మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధులు ప్రీ క్వార్టర్స్‌లో వరుస విజయాలు సాధించారు. ఇక నేడు జరిగే క్వార్టర్స్ పోరులో సింగపూర్ సూపర్ ఫైనల్స్ రిపీట్ కానున్నది. శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు సెమీస్ బెర్త్ కోసం తలపడనున్నారు. మహిళల సింగిల్స్ వరల్డ్ నెం.1 తారు జు యింగ్ (చైనీస్ తైపీ)తో పి.వి సింధు క్వార్టర్స్ సవాల్ ఎదుర్కొవాల్సి ఉండగా.. ఆరో సీడ్ సన్ యూ (చైనా)తో సైనా నెహ్వాల్ తేల్చుకోనున్నది.
తొలి గేమ్ ఓడినా.. : ప్రపంచ నెంబర్ వన్ సన్ వాన్ హోతో కిదాంబి శ్రీకాంత్ గొప్పగా ఆడాడు. ఇండోనే షియాలో వరుస గేముల్లో గెలుపొందిన శ్రీకాంత్.. సిడ్నీలో మూడు గేములు ఆడాల్సి వచ్చింది. తొలి గేమ్‌లో 4-6తో వెనుకంజ వేసిన శ్రీకాంత్ విరామ సమయానికి 8-11తో ఆధిక్యం ఇచ్చుకున్నాడు. ద్వితియార్థంలో పుంజుకుని 13-13తో స్కోరు సమం చేసినా.. సన్ వాన్ తొలి గేమ్ వశపర్చుకున్నాడు. ఇక నిలవాలంటే గెలవాల్సిన రెండో గేమ్‌లో శ్రీకాంత్ చెలరేగాడు. 4-2 నుంచి 11-5తో తిరుగులేని ఆధిక్యం సాధించాడు. సెకండ్ హాఫ్లోనూ వెనక్కి తగ్గని కిదాంబి.. 13-10, 18-13తో దూసుకెళ్లాడు. 21-13తో రెండో గేమ్ నెగ్గి మ్యాచ్‌ను నిర్ణయాత్మక గేమ్‌ను తీసుకెళ్లాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో శ్రీకాంత్ చెలరేగాడు. 6-3, 11-8తో విరామ సమయానికి ముందంజలో నిలిచాడు. 15-13తో సన్ వాన్ పాయింట్ల అంతరం తగ్గించే ప్రయత్నం చేసినా.. శ్రీకాంత్ జోరు ఆపలేకపోయాడు. వరు సగా ఆరు పాయింట్లు కొల్లగొట్టిన శ్రీకాంత్ 21-13తో మూడో గేమ్‌ను, క్వార్టర్ ఫైనల్స్ బెర్త్‌ను సొం తం చేసుకు న్నాడు. మరో ప్రీ క్వార్టర్స్‌లో బి. సాయి ప్రణీత్ 21-15, 18-21, 21-13తో గెలుపొందాడు. చైనా షట్లర్ హ్యూయాంగ్తో గంట పాటు పోరాడిన సాయి ప్రణీత్.. తొలి గేమ్‌లో గెలిచినా, రెండో గేమ్‌లో తృటిలో వెనక్కి తగ్గాడు. కానీ కీలక మూడో గేమ్‌లో 21-13 తో ఏకపక్ష విజయంతో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్‌లు క్వార్టర్స్‌లో ప్రవేశించారు. చైనా అమ్మాయి చెన్ షిమో షిన్‌పై సింధు 21-13, 21-18తో గెలుపొందగా, మలేషియా షట్లర్ సోనియా చియాపై 21-15, 20-22, 21-14తో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. తొలి గేమ్‌లో 11-6, 17-11తో దూసుకెళ్లిన సింధు.. రెండో గేమ్‌లో ప్రథమార్థంలో 6-6 నుంచి 11-11 వరకూ కాస్త పోటీ ఎదుర్కొన్నది. కానీ విరామం తర్వాత 14-11, 18-14తో చెలరేగింది. సైనా నెహ్వాల్ తొలి గేమ్ నెగ్గి జోరుమీదున్నా.. టైబ్రేకర్‌లో రెండో గేమ్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 11-7తో చెలరేగిన సైనా.. 16-8, 19-12తో తిరుగులేని ఆధిక్యం సాధించి క్వార్టర్స్ లోకి చేరుకున్నది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టిలు 16-21, 18-21తో చైనీస్ తైపీ జోడీ చేతిలో ఓటమిపాలవగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 21-18, 18-21, 13-21తో ఏడో సీడ్ జపాన్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









