*తప్పుగా అనుకోవద్దు*


కళ్ళు మూసుకోలేదు 
చెవులు దాచుకోలేదు
ఎందుకో మరి 
నువ్వు కనబడలేదు 
అసలు వినబడలేదు
అప్పుడెప్పుడో 
సాగర తీరంలో ఏరుకున్న గవ్వలు 
వాగు ఇసుకలో దొరికిన గులకరాళ్లు 
జ్ఞాపకాల పండగ చేస్తున్నపుడో
ఇంకెప్పుడో....
అక్షరాల భావ చిత్రాలను చూస్తూనో 
మనసు చెప్పే మూగ భాషను వింటూనో
బహుశా నిన్ను గమనించనే లేదు
చీకటి కానే కాదు 
ఉరుములు లేనే లేవు 
ఎందుకో మరి 
నువ్వు కనబడలేదు 
అసలు వినబడలేదు
కళ్ళను ఆకాశంలో విసిరేసి 
అనంత విశ్వం చూస్తున్నప్పుడో
చెవులను సంద్రంలో పడేసి 
కడలి దుఃఖం వింటున్నప్పుడో
బహుశా నిన్ను గమనించనే లేదు
నేస్తం నిజమే చెప్తున్నా 
నమ్మక తప్పదు మరి !!!!?
*పారువెల్ల*

 

Back to Top